'అమ్మ' మరణం తర్వాత ఏం జరిగింది? తొలిసారి నోరు విప్పిన శశికళ

తమిళనాట తిరుగులేని రాజకీయ అధిక్యతను ప్రదర్శించటమే కాదు కోట్లాదిమంది తమిళుల మనసు దోచుకొని ‘అమ్మ’గా అందరూ ఆరాధించేలా చేసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు;

Update: 2026-02-26 07:54 GMT

తమిళనాట తిరుగులేని రాజకీయ అధిక్యతను ప్రదర్శించటమే కాదు కోట్లాదిమంది తమిళుల మనసు దోచుకొని ‘అమ్మ’గా అందరూ ఆరాధించేలా చేసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించటం.. వారాల తరబడి అక్కడే ఉన్న ఆమె.. ఆ తర్వాత అక్కడే కన్నుమూసిన వైనం తెలిసిందే. జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. పార్టీలో ఏం జరిగింది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు బయటకు రాని పరిస్థితి. జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆమె నెచ్చెలి శశికళ సైతం ఎప్పుడూ ఈ వివరాల్ని వెల్లడించింది లేదు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె జయ మరణానికి ముందు.. మరణం తర్వాత ఏం జరిగిందన్న విషయాల్ని చెప్పుకొచ్చారు. ఆమె నోరు విప్పటం ఇదే తొలిసారి. రామనాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. జయలలితను ముఖ్యమంత్రిని చేయటంలో తానెంత కీలకంగా వ్యవహరించానన్న విషయాన్ని వెల్లడించటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి. 1987లో ఎంజీఆర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జయలలితను అనుమతించని విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. అప్పుడు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

‘ఎంజీఆర్ మ్రతదేహానికి పూలమాల వేసిన జయలలితను ఆర్ఎం వీరప్పన్ మద్దతుదారులు కొందరు కిందకు నెట్టేశారు. ఆమెను అప్పుడు నేనే పట్టుకున్నా. అప్పుడే నేనో శపధం చేశారు. మీరు తోసేసిన జయలలితను అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రిని చేసి చూపుతానని చెప్పా. రాజకీయాలు తనకు వద్దని నాతో చెప్పింది. అందరూ తనను అవమానించారని జయలలిత చెప్పినప్పుడు ఆమెకు ధైర్యం చెప్పా. రాజకీయాల్లో కొనసాగేలా చేశా’’ అంటూ అప్పట్లో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

2016లో జయలలిత అనారోగ్యం పాలయ్యారని.. 72 రోజులు ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స అందించిన తర్వాత.. మంచి రోజు చూసుకొని ఇంటికి తీసుకెళదామని అనుకుంటున్న సమయంలోనే అనూహ్య రీతిలో ఆమెకు గుండెపోటు రావటంతో మరణించారన్నారు.ఆమె మరణించిన తర్వాత పలువురు పలు విధాలుగా మాట్లాడారని.. జయలలితను తానే చంపినట్లుగా ప్రచారం చేశారన్నారు. జయలలిత మరణించిన రోజు రాత్రి మంత్రులు.. ఎమ్మెల్యేలు వచ్చి నన్నుముఖ్యమంత్రి,, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి తీసుకోవాలని కోరినట్లుగా చెప్పారు.

అయితే.. తాను జయలలితకు అంత్యక్రియలు చేయాలని.. పన్నీర్ సెల్వంను సీఎంగా ఉండాలని చెప్పినట్లుగా చెప్పారు. ‘‘సీఎంగా ఉన్న పన్నీరు సెల్వంపై మంత్రులు ప్రతిరోజు ఫిర్యాదు చేస్తుండేవారు. అందుకే సీఎం అయ్యేందుకు ఒప్పుకున్నా. ఈ విషయాన్ని ఆయనతోనూ మాట్లాడా. అందుకు ఆయన కూడా ఓకే చెప్పారు. కానీ.. ఆ తర్వాత ఏమైందో తెలీదు పన్నీరు సెల్వంకు ఎవరో ఏదో చెప్పటంతో జయ సమాధి వద్ద ధర్మయుద్ధం చేశారు. ప్రస్తుతం ఆయనకు అదే సమస్యగా మారింది. ఆ తర్వాత నేను వద్దన్నా ప్రధాన కార్యదర్శిగా నియమించారు’’ అని అప్పటి సంగతుల్ని వెల్లడించారు.

తాను సీఎంగా లేఖ ఇచ్చిన సమయంలో గవర్నర్ లేరని.. ఆ వెంటనే కోర్టు తీర్పు వచ్చిందన్న శశికళ ‘ఆ విషయాలకు నేను భయపడలేదు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయకూడదనే ప్రతిపక్ష నేతగా ఉన్న పళనిసామిని సీఎంగా కూర్చోబెట్టి జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యా’’ అంటూ నాటి సంగతులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం (ఫిబ్రవరి 24న) శశికళ కొత్త పార్టీని పెడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ పేరును ఆమె అధికారికంగా వెల్లడించలేదు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ తర్వాత ఇంతకాలానికి ఆమె రాజకీయ పార్టీని ఏర్పాటు ప్రకటన చేశారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ నుంచి వచ్చిన రాజకీయ పార్టీ ప్రకటన ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News