కేసీఆర్ ఊతపదంతోనే రేవంత్ చెడుగుడు !
రాజకీయాల్లో ఒక్కో నేతకు ఒక్కో ఊతపదం ఉంటుంది. అలాగే తెలుగునాట తిట్ల రాజకీయం భలే పసందుగా ఉంటుంది.;
రాజకీయాల్లో ఒక్కో నేతకు ఒక్కో ఊతపదం ఉంటుంది. అలాగే తెలుగునాట తిట్ల రాజకీయం భలే పసందుగా ఉంటుంది. నాయకులు ప్రత్యర్ధులను విమర్శించే క్రమంలో పాత సామెతలను వల్లె వేస్తారు పడికట్టు పదాలను జత కలుపుతారు. ఇళ్ళలో అల్లరిగా తిట్టే పదాలను కూడా మిళాయించి మరీ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తారు.
ఈ విషయాలలో కేసీఆర్ సిద్ధ హస్తుడుగా పేరు గడించారు. ఆయన ప్రత్యర్ధులు పేర్లు పెట్టకుండా సన్నాసులు అనే వారు. ఆ సన్నాసులున్నారే అని తిట్లు లంకించుకునేవారు. సన్నాసులు చటలు దద్దమ్మలు ఇలా అనేక తిట్లు అలవోకగా కేసీఆర్ నోట జాలువారేవి. వాటిని విని ఆనందించే వారు ఉన్నారు. అయ్యో ఇదేమి భాష అని విస్మయపడే వారూ ఉన్నారు.
ఏది ఏమైనా ఎవరినైనా అనడం అలా తిట్టడం ఒక్క కేసీఆర్ కే చెల్లు. అయితే ఆయన ఊతపదమైన సన్నాసులు అన్న దానిని ఇపుడు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పుణికి పుచ్చుకున్నారు. ఆయన కూడా సన్నాసులు అని వాడేస్తున్నారు. తాజాగా నల్లమలలో జరిగిన ఒక సభలో రేవంత్ మాట్లాడుతూ ఒక అయిదురుగు సన్నాసులు తెలంగాణాలో ఉన్నారని ఆశ్చర్యకరమైన విమర్శ చేశారు.
ఆ అయిదుగురు ఎవరో ఆయన చెప్పలేదు కానీ వారి ఊసే తాను తలవను పట్టించుకోనూ అన్నారు ఇక వారు సోషల్ మీడియా పులులు అని హాట్ కామెంట్స్ చేశారు. వారు సోషల్ మీడియాలో చేసే చెడు ప్రచారం గురించి తాను ఎక్కడా ఫికర్ అయ్యేదే లేదని అన్నారు. అసలు ఆ తప్పుడు ప్రచారం గురించి తాను పట్టించుకోను కదా అన్నారు.
తాను చేసే మంచి పనిని లబ్ది పొందిన వారు గుర్తు పెట్టుకుంటే చాలు అని రేవంత్ అన్నారు. అంతే తప్ప తమ మీద విషం చిమ్మాలని చూసే వారిని తాను ఏ మాత్రం ఖాతరు చేసేది లేదని రేవంత్ రెడ్డి ఖరాఖండీగా చెప్పేసారు. ఇలా రాష్ట్రంలో కొందరు సన్నాసులు ఉన్నారని ఆయన అన్నారు.
మరి ఆ సన్నాసులు ఎవరా అన్నదే అందరికీ అర్ధం అయ్యీ కాని విషయంగా ఉంది. రేవంత్ రెడ్డి విమర్శించారూ అంటే రాజకీయ ప్రత్యర్థుల గురించే అయి ఉంటుంది. మరి ఆ ప్రత్యర్ధులలో అంతలా సన్నాసులుగా ఉన్న వారు ఎవరు అన్నది ఒక ప్రశ్న అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి తప్పుడు ప్రచారం చేసే వారు ఎవరా అన్నది మరో ప్రశ్న.
అయితే రేవంత్ రెడ్డి చెప్పకపోయినప్పటికీ రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి ఆ సన్నాసులు అన్నది ఎవరి గురించో తెలుసు. కానీ ఆయన పేరు చెప్పలేదు కాబట్టి ఎవరూ ఆ పేర్లను గురించి కాకుండా భలే సెటైర్లు వేశారే అని అనుకుంటున్నారు. ఇంతకీ కేసీఆర్ తరహాలో సన్నాసుల జాబితాను రేవంత్ రెడ్డి తయారు చేస్తున్నారులా ఉంది అని కామెంట్స్ చేస్తున వారూ ఉన్నారు.
ఏది ఏమైనా అధికారంలో ఉన్న వారిని విమర్శించడం విపక్షం విధి అయితే వారి మీద కౌంటర్లు వేయడం అధికార పక్షం పరమావధి. సో అలా సన్నాసులు అయిన వారు ఇపుడు అయిదారుగురు రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నారు అన్న మాట. సో వారి పేర్లతో సహా పిలిచి వారే సన్నాసులు అని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ అయినా చెబుతారమో చూడాల్సి ఉంది.