పాశమైలారంలో యమపాశం.. 35కి చేరిన మృతులు.. తాజా పరిస్థితి ఇదే!
ఈ ఘటనలో మృతుల సంఖ్య 35కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.;
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మందుల ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 35కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అవును... పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఘోరం జరిగిపోయింది. ఈ క్రమంలో... ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. ఓ పక్క కాలిపోయిన మృతదేహాలు.. మరోపక్క క్షతగాత్రుల హాహాకారాలు.. ఇంకోపక్క బాధితుల ఆర్తనాదాలు.. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు.. పరిశ్రమ చుట్టుపక్కల పరిస్థితిని ఒక్కసారిగా మార్చేశాయి.
ఈ ఘటనలో మృతుల సంఖ్య 35కి చేరింది. అయితే.. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని అంటున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఈ సంస్థ పని చేస్తోందని అంటున్నారు.
ఆ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన సమయంలో ఏకంగా 700-800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని చెబుతున్నారు. ఆ కారణంగానే అక్కడ పనిచేస్తున్నవారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి.
సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది. ఇలా సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ఎన్ గోవన్ కూడా దుర్మరణం పాలయ్యారు. గోవన్ ప్లాంట్ లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించింది. ప్రమాద ధాటికి ఆయన కారు నుజ్జునుజ్జయింది.
గోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరి పడిందని చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ బీమ్ లు సైతం విరిగి, కుప్ప కూలిపోవడంతో నష్టతీవ్రత అనూహ్యంగా పెరిగింది.
ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టగా... 11 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేశాయి. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ ల ఆధ్వర్యంలో.. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఈ పేలుడు ధాటికి ఐదుగురు సజీవదహనమవ్వగా.. మరికొంతమంది 100 మీటర్ల దూరంలో ఎగిరిపడటం, మరికొంతమంది శిథిలాల కింద నలిగిపోవడం జరిగింది. దీంతో... మృతదేహాలను గుర్తుపట్టడానికి డీఎన్‌ఏ పరీక్షలే దిక్కని వైద్యులు చెబుతున్నారు. అప్పటివరకూ మృతదేహాల అప్పగింత సాధ్యంకాకపోవచ్చని అంటున్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్:
సిగాచీ ఇండస్ట్రీస్ కెమికల్ ఫ్యాక్టరీలోని ప్రమాద బాధితుల కోసం సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద బాధితుల వివరాల కోసం 08455276155ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. మరోవైపు... పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని మంత్రి వివేక్ తెలిపారు.