అమెరికాలో మళ్లీ అదే తంతు.. ఈసారి రైలులో!

ఇలా వరుస ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతున్నా మళ్లీ మళ్లీ ఇవే ఘటనలు జరుగుతున్నాయి.

Update: 2024-03-16 05:43 GMT

అమెరికాలో గన్‌ కల్చర్‌ కు అడ్డుకట్ట పడటం లేదు. విచ్చలవిడిగా తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. ఈ తుపాకీ సంస్కృతికి అమాయకులు బలవుతున్నారు. ఇటీవల స్కూలు పిల్లలపై, ఒక బర్త్‌ డే పార్టీపై సాయుధులైన దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఇలా వరుస ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతున్నా మళ్లీ మళ్లీ ఇవే ఘటనలు జరుగుతున్నాయి.

తాజాగా అమెరికాలోని అతిపెద్ద నగరం న్యూయార్క్‌ లో రైలులో భయానక ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తుపాకీని తీసి ఒక ప్రయాణికుడి తలపై కాల్చాడు. ఈ అనుకోని ఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో నలువైపులా పరుగులు తీశారు.

ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రాణభయంతో వణికిపోయిన ప్రయాణికులు రైలు ఆగాక తలుపులు తీసుకుని నలువైపులా పరుగులు పెట్టారు.

అమెరికా కాలమానం ప్రకారం మార్చి 15న గురువారం సాయంత్రం రద్దీ సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం 4:45 గంటలకు నోస్ట్రాండ్‌ అవెన్యూ స్టేష¯Œ లో రైలు ఎక్కిన తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వీరిద్దరిలో ఒకరి వయసు 32 ఏళ్లు కాగా, మరొకరిది 36 ఏళ్లు అని పోలీసులు చెబుతున్నారు.

Read more!

దీంతో రెచ్చిపోయిన 36 ఏళ్ల వ్యక్తి తన వద్ద ఉన్న రేజర్‌ బ్లేడ్‌ కత్తితోపాటు తుపాకీని బయటకు తీశాడు. 32 ఏళ్ల వ్యక్తిపై దాడి చేశాడు. అంతేకాకుండా తన వద్ద ఉన్న తుపాకీతో అతడి తలపై కాల్చాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

కాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో కనీసం నాలుగుసార్లు తుపాకీని పేల్చినట్టు వినిపించాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తిపై ఇంకా అభియోగాలు నమోదు కాలేదు. ఆత్మరక్షణ కోసం తాను కాల్పులు జరిపానని అతడు చెబుతున్నాడని తెలుస్తోంది.

Full View
Tags:    

Similar News