రాజకీయ వారసత్వం నుంచి ర్యాంప్ వాక్ వరకు.. 'మిస్ ఇండియా-2026' గా సాధ్వి

ఈ కిరీటం సాధ్వికి అంత సులభంగా దక్కలేదు. ఈ పోటీకి అర్హత సాధించేందుకు ఆమె తన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకున్నారు. పోటీకి సిద్ధమయ్యే క్రమంలో ఆమె దాదాపు 10 కిలోల బరువు తగ్గారు.;

Update: 2026-04-22 06:55 GMT

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి గ్లామర్, ఫ్యాషన్ ప్రపంచంలో అత్యున్నత శిఖరానికి చేరుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. కర్ణాటకలోని కార్వార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ సైల్ కుమార్తె సాధ్వి సైల్ 61వ ఫెమినా మిస్ ఇండియా-2026 కిరీటాన్ని కైవసం చేసుకోవడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందాల పోటీలు అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు.., మేధస్సు, పట్టుదల, వ్యక్తిత్వానికి ఒక పరీక్ష. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో గోవాకు ప్రాతినిధ్యం వహించిన సాధ్వి సైల్, 29 మంది అభ్యర్థులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. ఒక ఎమ్మెల్యే కుమార్తెగా రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఆమె చేసిన కృషి ఈ రోజు ఫలించింది.

 

కానీ తనదైన గుర్తింపు!

కర్ణాటక రాజకీయాల్లో ప్రముఖ నేతగా ఉన్న సతీష్ సైల్ కుమార్తెగా సాధ్వికి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అలవడింది. సాధ్వి కేవలం అందగత్తె మాత్రమే కాదు, మంచి విద్యావంతురాలు కూడా. ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్, కెనడాలోని ప్రతిష్టాత్మక ‘బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం’ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివారు. కిరీటం గెలిచిన వెంటనే ఆమె తన తండ్రికి వీడియో కాల్ చేసి ఆనందాన్ని పంచుకోవడం.. రాజకీయ నేతగా ఉన్న ఒక తండ్రికి తన బిడ్డ సాధించిన ఈ విజయం ఎంతటి గర్వకారణమో చాటిచెప్పింది.

 

10 కిలోల బరువు తగ్గి!

ఈ కిరీటం సాధ్వికి అంత సులభంగా దక్కలేదు. ఈ పోటీకి అర్హత సాధించేందుకు ఆమె తన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకున్నారు. పోటీకి సిద్ధమయ్యే క్రమంలో ఆమె దాదాపు 10 కిలోల బరువు తగ్గారు. నిరంతర వ్యాయామం, యోగా, కఠినమైన డైట్ పాటించి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ఆమెకు కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. ఫోటోగ్రఫీ, బ్యాడ్మింటన్, తేనెటీగల పెంపకంలో ఆసక్తి ఉండడం విశేషం. పర్యావరణం, ప్రకృతి పట్ల ఆమెకు ఉన్న ప్రేమను ఇది తెలియజేస్తోంది.

 

మిస్ వరల్డ్ 2026 రేసులో..

మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న సాధ్వి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 5న వియత్నాంలో జరగనున్న మిస్ వరల్డ్-2026 పోటీల్లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ‘భారతదేశం గర్వపడేలా చేయడమే నా లక్ష్యం’ అని ఆమె ప్రకటించడం, ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతిని, గరిమను చాటిచెప్పాలనే ఆమె సంకల్పాన్ని చూపిస్తోంది.

నిర్మాణ రంగంపై ఆసక్తి..

సాధ్వికి కేవలం గ్లామర్ ప్రపంచమే కాదు, తన తండ్రి వ్యాపారాలైన నిర్మాణం, అభివృద్ధి రంగాలపై కూడా మంచి అవగాహన ఉంది. తన ప్రయాణాన్ని నిజాయితీతో, చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలని ఆమె కోరుకుంటున్నారు. కిరీటం గెలిచిన క్షణం తనకు ఒక ‘అధ్బుతమైన స్వప్నం’ (Surreal) లా అనిపించిందని ఆమె వ్యాఖ్యానించారు.

సాధ్వి సైల్ విజయం ఎందరో యువతులకు స్ఫూర్తినిస్తోంది. ‘ఏ రంగం నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు, ఎంత పట్టుదలతో పనిచేశామన్నదే ముఖ్యం’ అని ఆమె నిరూపించారు. 2025 విజేత నికితా పోర్వాల్ నుంచి కిరీటాన్ని అందుకున్న సాధ్వి, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ‘ప్రపంచ సుందరి’ కిరీటం కోసం సిద్ధమవుతున్నారు. ఒక రాజకీయ నాయకుడి కుమార్తెగా కాకుండా, ఒక స్వతంత్ర మహిళగా ఆమె సాధించిన ఈ విజయం అభినందనీయం.

Tags:    

Similar News