ఎస్ కోటలో కోళ్ళ రాజకీయానికే ఎస్ !

విజయనగరం జిల్లాలో ఎస్ కోట కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. ఒక విధంగా చెప్పాలీ అంటే విజయనగరం అభివృద్ధికి ముఖ్య కేంద్రంగా ఉంది.;

Update: 2026-03-30 07:30 GMT

విజయనగరం జిల్లాలో ఎస్ కోట కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. ఒక విధంగా చెప్పాలీ అంటే విజయనగరం అభివృద్ధికి ముఖ్య కేంద్రంగా ఉంది. జిల్లాలో భూములు కావాలన్నా అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ నియోజకవర్గం కీలకంగా మారుతోంది. రియల్ ఎస్టేట్ బూం ఇక్కడ ఎక్కువ. ఇక ఎస్ కోట అసెంబ్లీ సీటు మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. టీడీపీ పుట్టాక ఇప్పటిదాకా జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై శాతం గెలుపు టీడీపీదే అయింది అంటే అంతలా ప్రజలు పసుపు పార్టీని ఆదరిస్తున్నారు అని చెప్పాల్సిందే.

కోళ్ళ కుటుంబం పట్టు :

ఇక ఎస్ కోట నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటికి ఎనింది ఎన్నికల్లో గెలిచింది. అందులో మొదటి నాలుగు పర్యాయాలు ఎల్బీ దుక్కు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీని బలోపేతం చేశారు. ఆ తర్వాత శోభా హైమావతి టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ 2004లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 2009, 2014లలో కోళ్ళ లలితకుమారి ఎమ్మెల్యేగా మంచి విజయాన్ని సాధించారు 2019లో వైసీపీ గెలిస్తే 2024 నాటికి మళ్ళీ ప్రజలు ఆమెకే పట్టం కట్టారు. ఆమె మామ కోళ్ళ అప్పలనాయుడు 1967 సమయంలోనే ఇండిపెండెంట్ గా ఎస్ కోట నుంచి గెలిచి వచ్చిన వారు. ఆయనంటే జనాల్లో ఎంతో అభిమానం ఉంది. దాంతో ఆయన వారసురాలిగా కోడలు లలిత కుమారి రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం అయితే జనాలు ఆమెను ఆదరించడం మరో విశేషం.

వచ్చే సారి సైతం :

ఇక 2029 నాటికి కోళ్ళ లలిత కుమారిని తప్పిస్తారని ఎన్నారై గా ఉన్న గొప్మ క్రిష్ణని టికెట్ ఖాయమని ఇప్పటిదాకా అంతా అనుకుంటూ వచ్చారు. అయితే డీ లిమిటేషన్ ప్రక్రియ మీద వార్తలు రావడం దాంతో పాటు ముప్పయి మూడు శాతం రిజర్వేషన్లు మహిళలకు దక్కబోతున్నాయని తెలియడంతో కోళ్ళ లలిత కుమారికే మరో చాన్స్ అని ఆమె వర్గం సంబరాలు చెసుకుంటోంది. ఆమె సీటుకు తిరుగులేదని వారు అంటున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలతో మమేకం అయ్యే కోళ్ళ లలిత కుమారి జనాదరణలో మేటిగా ఉన్నారని అందుకే ఆమెకు టికెట్ మళ్ళీ ఖాయమని అంటున్నారు.

రెండుగా మారితే :

ఇక ఎస్ కోట పెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. ఇది మూడు లక్షల జనాభాతో ఉంది. దాంతో కొత్త సీట్లుగా మార్చేందుకు విభజిస్తే కనుక ఎస్ కోట పేరు ముందు వరసలో ఉంటుంది. అలా ఎస్ కోట మరో నియోజకవరంగా మారుతుంది అని అంటున్నారు. అలా మారిన కొత్త నియోజకవర్గానికి గొంప క్రిష్ణకు టికెట్ ఇస్తారని ఈ విధంగా ఇద్దరికీ సమ న్యాయం చేస్తారు అని టీడీపీ వర్గాలలో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం గొంప క్రిష్ణ ఎస్ కోట టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. విజయనగరం జిల్లాకు డీసీఎంఎస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు విశాఖ ఎంపీ భరత్ తో పాటు పార్టీ పెద్దల మద్దతు ఉంది. నిజానికి 2024 లోనే టికెట్ ఆయనకు దక్కాల్సి ఉంది. కానీ సీనియారిటీ ప్రాతిపదికన కోళ్ళ లలితకుమారికి చాన్స్ ఇచ్చారు. ఇపుడు లక్కీగా మహిళా రిజర్వేషన్ తో ఆమె మళ్ళీ చాన్స్ అందుకోనున్నారని అంటున్నారు.

Tags:    

Similar News