వైసీపీకి పవనే టార్గెట్.... ఎందుకంటే ?
అయితే దీనిని ధీటైన బదులే జనసేన మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చారు. జబర్దస్త్ అంటూ గత అయిదేళ్ళూ వైసీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా రోజా చేసిన విన్యాసాల సంగతి ఏమిటి అని ఆయన నిలదీశారు.;
వైసీపీ కూటమిలో రెండు ప్రధాన పార్టీల మీద ఎపుడూ ఫోకస్ పెడుతుంది. ఎక్కువగా తెలుగుదేశాన్ని విమర్శిస్తుంది. ఆ తర్వాత స్థానం జనసేనదే. ఈ రెండు పార్టీల కలయికతోనే వైసీపీకి ఏపీలో అధికారం పోయింది. దాంతో రాజకీయ వ్యూహమా లేక ఆ రెండు పార్టీలని వీక్ చేయాలనా విడదీయాలనా ఏమో తెలియదు కానీ వైసీపీ టార్గెట్ ఎపుడూ అటు వైపే ఉంటుంది అని అంటున్నారు ఇక వైసీపీలో పవన్ ని ఎక్కువగా విమర్శించే మాజీ మంత్రులలో అంబటి రాంబాబు, పేర్ని నాని తరువాత ఆర్కే రోజా కూడా ఉంటారు. తాజాగా ఆమె పవన్ సినిమాల మీద చేసిన కామెంట్స్ రాజకీయ మంటనే పుట్టించాయి.
ఓట్లేసింది అందుకోసమా :
పవన్ కి జనాలు ఓట్లేసి గెలిపించింది సినిమాలు చేసుకోవడానికా అని రోజా మీడియా సమావేశంలో విమర్శించారు. పవన్ షూటింగులు చేసుకుంటున్నారని ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని రోజా హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు ప్రత్యేక విమానాలలో తిరుగుతూ మరీ సినిమాలు చేసుకుంటున్నారు అని హీటెక్కించే విమర్శలనే చేశారు. ప్రజా సమస్యలు ఏవీ ఆయన పట్టించుకోరా అని కూడా రెట్టించారు.
జబర్దస్త్ మాటేంటో మరి :
అయితే దీనిని ధీటైన బదులే జనసేన మంత్రి కందుల దుర్గేష్ ఇచ్చారు. జబర్దస్త్ అంటూ గత అయిదేళ్ళూ వైసీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా రోజా చేసిన విన్యాసాల సంగతి ఏమిటి అని ఆయన నిలదీశారు. పవన్ తన విలువైన కాలంలో తొంబై శాతం రాజకీయాలకు పది శాతం మాత్రమే సినిమాలకు కేటాయిస్తున్నారు అని ఆయన వివరించారు. పవన్ కి సినిమాలే ఆధారం అని ఆయన అంటూ ఆ ఆదాయాన్ని కూడా ఆయన పార్టీ కోసం ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతల మాదిరిగా అక్రమ వ్యాపారాలు ఆస్తులు ఏవీ లేవని కూడా కందుల గట్టిగానే చురకలు అంటించారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా తన హయాంలో చేసింది ఏమిటో చెప్పాలని కూడా సూటిగా నిలదీశారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా మీ హయాంలో తీసుకుని వచ్చారా అని కూడా నిగ్గదీశారు.
సినిమా మీద పడ్డారా :
ఇక చూస్తే కనుక పవన్ పదిహేను నెలలుగా తన మంత్రిత్వ శాఖలలో చాలా నిబద్ధతతో ఉన్నారని అంటున్నారు. ఆయన మీద విమర్శలు చేయాలంటే రాజకీయంగా చేయవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలో ఏ విధంగా చూసినా తప్పులు పెద్దగా దొరకడం లేదని అందుకే సినిమాల మీద పడ్డారని అంటున్నారు. పవన్ సినిమా షూటింగులు మీద వైసీపీ విమర్శలు చేయడం ద్వారా నెగిటివిటీని పెంచాలని చూస్తోందని అంటున్నారు. అయితే సినిమాలు రాజకీయాలు కలిపి చేస్తున్న వారు పవన్ ఒక్కరే కాదు అని చాలా మంది ఉన్నారని గతాన్ని గుర్తు చేస్తున్నారు.
పవర్ స్టార్ డంతో :
పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత ఎదిగినా సినిమాలు కూడా చేస్తూ ఉండాలి అన్నది అభిమానుల అభిమతం. దానికి తగినట్లుగానే ఆయన చేస్తున్నారు అని అంటున్నారు. ఇక పవర్ స్టార్ ఇమేజ్ కూడా ఆయనకు కానీ పార్టీకి కానీ అడిషనల్ గా లభించే అడ్వాంటేజ్ అని అంటున్నారు. దాంతో పవన్ సినిమాలు చేయడం బహుముఖ వ్యూహం గానే ఉంది అని చెబుతున్నారు. ఇక జనాల వరకూ తీసుకుంటే దీనిని ఎవరూ సీరియస్ గా తీసుకునే చాన్స్ అయితే ఉండబోదు అని అంటున్నారు. మరి వైసీపీ దీనిని జనాలలో పెట్టి ఎంతవరకూ జనసేన మీద వ్యతిరేకత పెంచుతుంది అన్నదే చూడాల్సి ఉందని అంటున్నారు.