ట్రంప్ పేరుతో ఫేక్ ఆధార్... దేశంలో తెరపైకి రాజకీయ రచ్చ!

అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరుతో ఫేక్‌ ఆధార్‌ సృష్టించారనే ఆరోపణ నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.;

Update: 2025-10-30 11:30 GMT

నకిలీ గుర్తింపుకార్డులతో మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో నమోదయ్యేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఓ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డును సృష్టించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే రోహిత్ పవార్ పై సౌత్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్‌ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరుతో ఫేక్‌ ఆధార్‌ సృష్టించారనే ఆరోపణ నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేపై ఫోర్జరీ, గుర్తింపు దొంగతనం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారత శిక్షాస్మృతి (బీ.ఎన్.ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.

అక్టోబర్ 16న ఏమి జరిగింది..?:

అక్టోబర్ 16న ఒక ప్రెస్ మీట్ సందర్భంగా.. రోహిత్ పవార్ అనధికార వెబ్‌ సైట్‌ ను ఉపయోగించి కేవలం 20 రూపాయలకే నకిలీ ఆధార్ కార్డులను ఎలా సృష్టించవచ్చో బహిరంగంగా ప్రదర్శించారు. ఇందులో భాగంగా... తన నియోజకవర్గంలోని నివాస చిరునామాకు అనుసంధానించబడిన డొనాల్డ్ ట్రంప్ పేరు, ఫోటోగ్రాఫ్ ఉన్న నమూనా ఆధార్ కార్డును ఆయన ప్రదర్శించారు.

అయితే, నకిలీ ఆధార్‌ కార్డులు ఎలా పుట్టుకొస్తున్నాయో బహిర్గతం చేసేందుకే తాను ఇలా చేశానని ఎమ్మెల్యే రోహిత్‌ పేర్కొన్నారు. ఈ నకిలీ గుర్తింపు కార్డులతో మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో నమోదయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. అయితే రోహిత్‌ చర్యలు కాస్త రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు!

పోలీసుల దర్యాప్తు..!:

ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలను ఆన్‌ లైన్‌ లో సృష్టించడం, పంచుకోవడం వంటివి జాతీయ డేటా సమగ్రతను దెబ్బతీస్తాయని.. ఇదే సమయంలో భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని అధికారులు తెలిపారు. ఇది ఉదాహరణ కోసం చేసినప్పటికీ, నకిలీ ప్రభుత్వ పత్రాలను ఉపయోగించడం అనేది శిక్షార్హమైన నేరం అని పోలీసులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా... వెబ్‌ సైట్ సృష్టికర్త, దాని యజమాని, వినియోగదారు రోహిత్ పవార్ తో పాటు ఇందులో పాల్గొన్న ఇతర వ్యక్తులపైనా కేసు నమోదు చేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి నవనాథ్ బాన్ తెలిపారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 336(2), 336(3), 336(4), 337, 353(1)(బీ), 353(1)(సీ), 353(2) అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66(సీ) కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్సీపీ నుంచి తీవ్ర విమర్శలు!:

రాష్ట్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి సంస్థ అయినప్పటికీ.. దాని వెబ్‌ సైట్ నిర్వహణ బాధ్యతను మాత్రం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆఫీస్ బేరర్ దేవాంగ్ డేవ్‌ కు అప్పగించిందని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వెబ్‌ సైట్‌ లోని జాబితాలో ఎవరి పేరును చేర్చాలో.. ఎవరి పేరును తొలగించాలో నిర్ణయించడానికి డేవ్ నియమింపబడ్డారని తాము దృఢంగా భావిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు!

ఓటర్లలో ఆకస్మిక పెరుగుదల..!:

ఇదిలా ఉండగా.. గత ఏడాది అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 19 మధ్య కేవలం నాలుగు రోజుల్లోనే 6,55,709 ఓట్లు ఓటర్ల జాబితాలో చేరాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ఆరోపించారు. ఈ సమయంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచుకున్న డేటాను ఆయన తన వాదనకు మద్దతుగా సమర్పించారు.

ఆ డేటా ప్రకారం.. 2024 ఏప్రిల్-మే నెలల్లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల వరకు మహారాష్ట్రలో 9,29,43,890 మంది నమోదైన ఓటర్లు ఉండగా... రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 30 ఆగస్టు 2024 నాటికి ఓటర్ల సంఖ్య 9,53,74,302 కు పెరిగింది. అంటే.. ఈ కాలంలో 2.4 మిలియన్ల కొత్త ఓటర్లు చేర్చబడ్డారని సావంత్ చెప్పారు!

ఇదే క్రమంలో... అక్టోబర్ 15, 2024న అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన రోజు నమోదైన ఓటర్ల సంఖ్య 9,63,69,410గా ఉందని ఆయన తెలిపారు!

Tags:    

Similar News