వచ్చే ఎన్నికల్లో ఫ్రీ ఏసీల హామీ?.. పెరుగుతున్న వేడి మధ్య కొత్త చర్చ!
ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు లగ్జరీ వస్తువుగా భావించిన ఎయిర్ కండీషనర్ (ఏసీ) ఇప్పుడు అవసరమైన గృహోపకరణంగా మారుతోంది.
దేశంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. ఒకప్పుడు మే నెలలో మాత్రమే కనిపించే భగ్గుమనే వేడి ఇప్పుడు మార్చి నుంచే ప్రారంభమవుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, చెట్ల కొరత కారణంగా వేడి ప్రభావం మరింత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు లగ్జరీ వస్తువుగా భావించిన ఎయిర్ కండీషనర్ (ఏసీ) ఇప్పుడు అవసరమైన గృహోపకరణంగా మారుతోంది.
ఇప్పటి వరకు ఏసీలను ధనికుల ఇళ్లలో మాత్రమే చూసేవారు. కానీ ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలు కూడా వేడిని తట్టుకోలేక ఈఎంఐ లపై అయినా ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఎండలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు సరిపోకపోవడంతో ఏసీలపై ఆధారపడాల్సి వస్తోంది. నగరాల్లోని అపార్ట్‌మెంట్లు, కాంక్రీట్ భవనాలు వేడిని మరింత పెంచుతున్నాయి. రాత్రివేళల్లో కూడా ఉక్కపోత తగ్గకపోవడంతో ప్రజలు నిద్రపోలేని పరిస్థితి నెలకొంటోంది.
ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల దృష్టి కూడా ఇప్పుడు ఏసీలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఎన్నికల సమయంలో ఉచిత హామీలు కొత్త విషయం కాదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మిక్సీలు, గ్రైండర్లు, స్కూటీలు వంటి పలు వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, మహిళలకు గృహోపకరణాలు, రైతులకు పరికరాలు ఇవ్వడం వంటి పథకాలు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో “ప్రతి ఇంటికి ఏసీ” అనే నినాదంతో రాజకీయ పార్టీలు ముందుకు రావచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేందుకు ఏసీలను ఉచితంగా లేదా సబ్సిడీపై అందించే హామీలు రావొచ్చని చర్చ జరుగుతోంది. ఇప్పటికే విద్యుత్ ఉచిత పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఈ ఆలోచనకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఉచిత ఏసీల హామీ అమలు చేయడం అంత సులభం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీల వినియోగం పెరిగితే విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలపై అదనపు భారం పడే అవకాశం ఉంది.
మరోవైపు పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికంగా ఏసీల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ వినియోగం పెరిగి కార్బన్ ఉద్గారాలు అధికమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే గ్రీన్ బిల్డింగ్స్, చెట్ల పెంపకం, కూల్ రూఫ్ టెక్నాలజీ, సోలార్ విద్యుత్ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ఏదేమైనా… పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల జీవనశైలిని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు విలాసానికి ప్రతీకగా ఉన్న ఏసీ ఇప్పుడు అవసరంగా మారుతుండటం కాలం మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఇది రాజకీయ హామీల్లో కూడా చోటు సంపాదిస్తుందా అనే చర్చ మాత్రం ఆసక్తికరంగా మారింది.