ఉద్యోగుల కోసం కొత్త బిల్లు : రైట్ టు డిస్ కనెక్ట్ అమలవుతుందా? సాధ్యమేనా?
పార్లమెంట్ లో తాజాగా కొత్త కార్మిక బిల్లు ప్రవేశపెట్టడంతో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇది ఉద్యోగులకు ‘రైట్ టు డిస్ కనెక్ట్’ అంటే పని నుంచి విరామం తీసుకునే హక్కును కల్పిస్తుంది.;
ఇప్పుడు అంతా గొడ్డు చాకిరీనే. ఎప్పుడో ఉదయం 8 గంటలకు పని మొదలుపెడితే.. రాత్రి 10 , 11 అయ్యేవరకూ వేళాపాళా లేని పనులు.. ఉద్యోగులను పీల్చి పిప్పి చేస్తున్న యాజమాన్యాలు. జీతాల కోసం తప్పని వెతలు. కార్మిక మూస చట్టాలతో ఇన్నాళ్లు ఉద్యోగులకు అసలు హక్కులు లేకుండా పోయాయి. అయితే కేంద్రం కార్మికుల కష్టాలను గమనించి కొత్త కార్మిక చట్టానికి రూపకల్పన చేసింది. అయితే ఇప్పుడు దీని అమలు కత్తిమీద సాములా మారింది. ఎందుకంటే కేంద్రం ఎన్ని చట్టాలు చేసినా వాటిని అమలుచేయాల్సిన యాజమాన్యాలు, అధికారులు నిక్కచ్చిగా ఉంటారా? ఉద్యోగుల కష్టాలు తీరుతాయా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
పార్లమెంట్ లో తాజాగా కొత్త కార్మిక బిల్లు ప్రవేశపెట్టడంతో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇది ఉద్యోగులకు ‘రైట్ టు డిస్ కనెక్ట్’ అంటే పని నుంచి విరామం తీసుకునే హక్కును కల్పిస్తుంది. ఇది ఐటీ రంగం వంటి వాటిలో ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం, వృత్తి పరమైన బాధ్యతలకు మధ్య సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ దీని అమలు పైనే అందరి దృష్టి నెలకొని ఉంది.
ఏంటీ ‘రైట్ టు డిస్ కనెక్ట్’ బిల్లు.. ఏముంది? ఎందుకోసం?
ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ ‘రైట్ టు డిస్ కనెక్ట్ బిల్ 2025’ ను ప్రవేశ పెట్టారు. పనివేళల తర్వాత యజమానుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించకుండా ఉండే హక్కును ఈ బిల్లు ప్రతీ ఉద్యోగికి ఇస్తుంది. ఒక ఉద్యోగి పనివేళలు దాటిన తర్వాత కాల్స్, లేదా ఈమెయిల్స్ కు స్పందించకపోయినా దానిపై కంపెనీల ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుంది. 10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు, ఉద్యోగుల లేదా వారి ప్రతినిధులతో కలిసి పనివేళలు దాటి తర్వాత పనిచేసే నిబంధనలు , షరతులపై చర్చలు జరపాలి. ఒకవేళ ఉద్యోగులు పనిచేస్తే వారికి ఓవర్ టైమ్ వేతనం చెల్లించాలి. ఈ నిబంధనను పాటించని కంపెనీలకు జరిమానా విధించాలని కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై కౌన్సిలింగ్ సేవలు, డిజిటల్ డిటాక్స్ కేంద్రాల ఏర్పాటుకు ఈ బిల్లు సిఫారసు చేస్తుంది.
భారత దేశంలో ఉద్యోగుల పని పరిస్థితులు అమెరికా, యూరప్ మార్కెట్ ల కంటే భిన్నంగా ఉంటాయి. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై అంతగా దృష్టి పెట్టరు. విదేశాల్లో మాత్రం అది స్ట్రిక్ట్ గా అమలవుతుంది. ఉద్యోగులు పనివేళలు ముగిసిన తర్వాత కూడా తమ యజమానుల నుంచి వచ్చే ఫోన్స్ కాల్స్, ఈమెయిల్స్ కు అందుబాటులో ఉండాలని ఇండియాలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల భారత్ లో ఉద్యోగులు తమ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోల్పోతున్నారు. నేటి డిజిటల్ సంస్కృతి కారణంగా ఏర్పడుతున్న ఒత్తిడిని అధిగమించడానికి విరామం అవసరం. ఆరోగ్యకరమైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మన జీవితానికి సమతుల్యతను ఇస్తుంది. ఈ బిల్లు ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక ముఖ్యమైన చర్యగా పేర్కొంటున్నారు.
ఇప్పటికే విదేశాల్లో ఈ బిల్లు అమల్లో ఉంది. యూరప్ దేశాలు, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇప్పటికే రైట్ టు డిస్ కనెక్ట్ అనేది సాధారణ పద్ధతిగా ఉంది. కానీ భారత్ లో మాత్రం ఉద్యోగలకు ఇది పూర్తిగా కొత్త విషయంగా ఇప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ బిల్లుపై దేశంలో చర్చ జరుగుతోంది.
బిల్లు ఆమోదం పొందుతుందా?
ఈ బిల్లును ఎన్సీపీ ఎంపీ ప్రతిపాదించారు. అధికార ఎన్డీఏ బీజేపీ నుంచి ఈ బిల్లు రాలేదు. సో పూర్తిగా ఇదో ప్రైవేట బిల్లు.. ఇలాంటి ప్రైవేటు బిల్లులు చట్టాలుగా మారడం చాలా అరుద. 1970 తర్వాత ఒక్క ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు. ప్రస్తుతానికి ఈ బిల్లు పార్లమెంట్ లో చట్టంగా మారే అవకాశాల తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగుల శ్రేయస్సు , వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై చర్చను మాత్రం దేశంలో బలంగా ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.