స్పెషల్ ఫ్లైట్ ను వదిలేసి.. ప్యాసింజర్ ఫ్లైట్ లో ఢిల్లీకి రేవంత్!
ప్రతి విషయంలోనూ ఆచితూచి అన్నట్లుగా ఖర్చు చేస్తున్న రేవంత్.. తాజాగా మరో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు.;
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటానికి ముందు నుంచి రాష్ట్రంలో మార్పును కొట్టొచ్చినట్లుగా కనిపించేలా చేస్తున్న రేవంత్ రెడ్డి.. మరోసారి తన మార్కును ప్రదర్శించారు. ఓవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వేళలోనే నాటి ప్రగతి భవన్ గడీలను తొలగించేసిన ఆయన.. కాన్వాయ్ లోనూ సొంత వాహనాన్ని వాడుకోవటం.. కొత్త వాహనాల కోసం రూ.కోట్లు ఖర్చు చేయొద్దని చెప్పటం తెలిసిందే. సీఎం అధికార నివాసంగా విలాసవంతమైన నాటి ప్రగతిభవన్ వద్దని.. తాను ఉండే ఇంటినే వాడేస్తున్న ఆయన.. అధికారిక కార్యకలాపాల కోసం ఏర్పాటు చేయనున్న భవనాన్ని సాదాసీదాగా నిర్మించాలని ఆదేశించటం తెలిసిందే.
ఢిల్లీలో ఉన్నప్పుడు తెలంగాణ భవన్ నుంచి ఫుడ్ తెప్పించే తీరుకు చెక్ చెప్పి.. తనకున్న సొంత చెఫ్ స్వయంగా వంట చేయాలని చెప్పటం.. అనవసరమైన హంగు.. ఆర్భాటాలన్నవి వద్దన్న విషయాన్ని మాటలతోనే కాదు చేతలతోనూ చేసి చూపిస్తున్న రేవంత్ తీరు ఇప్పుడు సరికొత్తగా మారింది. ప్రతి విషయంలోనూ ఆచితూచి అన్నట్లుగా ఖర్చు చేస్తున్న రేవంత్.. తాజాగా మరో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టినంతనే ప్రత్యేక విమానాల్లో ప్రయాణించే కల్చర్ కు పాతర వేశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ప్రత్యేక విమానంలో కాకుండా.. ప్యాసింజర్ విమానంలో అందరితో కలిసి ఒక్కడిగా వెళ్లిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. అంతేకాదు.. ముఖ్యమంత్రికి కాన్వాయ్ గా 15 వాహనాలు ఉంటే.. వాటిని తొమ్మిదికి కుదించటమేకాదు.. తాను ప్రయాణించే వేళలో.. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ట్రాఫిక్ నిలపొద్దని ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.
అధికారం అంటే.. హంగు.. ఆర్భాటం కాదు అధికారం అంటే భారీ కాన్వాయ్.. ప్రత్యేక విమానాల్లో ప్రయాణించటం కాదని.. అధికారం అంటే బాధ్యత అని.. అధికారం అంటే సామాన్యుడికి సేవ చేయటమన్న సంకేతాల్ని ఇస్తున్న రేవంత్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన్ను అభిమానించే వారిని.. ఆయన్ను సామాన్యుడి సీఎంగా అభివర్ణిస్తున్నారు. అధికారంలోకి వచ్చే ముందు నుంచి ఇప్పటివరకు.. తాను చేసే ప్రతి పనిలోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించేలా వ్యవహరిస్తున్న రేవంత్ తీరు అందరిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు.