బీ-ఫాం తీసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు రేవంత్ టచ్ లోకి...!!

ఈ సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-08 04:50 GMT

బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ పేర్లు ఎత్తితే రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో ఫైరవుతారానేది తెలిసిన విషయమే! పైగా రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అనూహ్యంగా ఆ డోస్ మరింత పెరిగిందని అంటున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ సీఎం... కేసీఆర్ & కో తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది.. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో... తమ ఇన్ని రోజుల పాలనకు ఈ లోక్ సభ ఎన్నికలు రెఫరెండం అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని, దీంతో మరింత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను చూస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో... అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బను... లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఎఫెక్ట్ తగ్గించుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తుందని చెబుతున్నారు. అదే క్రమంలో... తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు చెబుతున్న పరిస్థితి! ఈ సమయంలో లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 17 స్థానాల్లో పోటీ చేయడానికి తానే కారణం అని అంటున్నారు రేవంత్ రెడ్డి!

అవును... ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి... అసలు బీఆర్ఎస్ కు సీట్లు వచ్చే పరిస్థితే లేదని అన్నారు. సర్వే ఫలితాలు అనుకున్నా.. తనకున్న సమాచారం అనుకున్నా.. పోటీ చేస్తున్న అభ్యర్థుల పరిస్థితిని పరిగణలోకి తీసుకున్నా.. కేవలం మూడు, నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ రెండో ప్లేస్ లో ఉందని.. మిగిలిన అన్ని స్థానాల్లోనూ మూడో స్థానంలో ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more!

ఇదే క్రమంలో... తాను తలచుకుని ఉంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 17 స్థానాల్లోనూ కనీసం పోటీలో కూడా ఉండేది కాదన్ని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు బీ-ఫాం తీసుకుని, స్కూటినీ అయిన తర్వాత కూడా.. నామినేషన్లు విత్ డ్రా చేసుకుని కాంగ్రెస్ లోకి వస్తామని తనతో అన్నారని రేవంత్ తెలిపారు. అయితే ఆ అవసరం లేదని తాను వారితో చెప్పినట్లు సీఎం అన్నారు.

అలా కాకుండా తాను వారిని ఆహ్వానించి ఉంటే.. బీఆర్ఎస్ పార్టీకి ఆరు స్థానాల్లో అభ్యర్థులే ఉండేవారు కాదని.. తనవల్లే ఆ పార్టీ 17 స్థానాల్లోనూ పోటీలో ఉందని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు!

Tags:    

Similar News