టీ ప్రాజెక్టుకు ఆ రాష్ట్రం ఓకే.. రేవంత్ సర్కారు మరో సక్సెస్!
సమ్మక్క సాగర్ పాజెక్టుకు ఎన్ ఓసీ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని తెలంగాణ నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు.;
తడబడే అడుగులతో మొదలైన రేవంత్ సర్కరు ప్రయాణం ఒక్కొ ఒక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లటమే కాదు.. కొన్ని విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటూ వెళుతోంది. తాజాగా అలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తాను తలపెట్టిన ప్రాజెక్టుకు సంబంధించి.. ఇరుగున ఉన్న ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం చేత ఓకే అనిపించటంలో విజయం సాధించింది. దీంతో.. తెలంగాణలోని రేవంత్ సర్కారు చేపట్టాలని భావిస్తున్న సమ్మక్క సాగర్ డ్యామ్ నిర్మాణానికి క్లియరెన్సు లభించిందని చెప్పాలి.
సమ్మక్క సాగర్ పాజెక్టుకు ఎన్ ఓసీ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని తెలంగాణ నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. నీట మునిగే భూభాగం పరిహారం భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. దీంతో.. ఈ ప్రాజెక్టుకు తమ రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన ఎన్ వోసీ ఇస్తామన్న అంగీకారాన్ని తెలియజేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలిపోయిందని చెప్పాలి.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే.. ఇది పూర్తైయితే.. నల్గొండ.. వరంగల్ తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు.. రామప్ప-పాకాల లింక్ కెనాల్ కింద కొత్తగా 12,146 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కొత్త జిల్లాల్నే లెక్కలోకి తీసుకుంటే.. వరంగల్.. సూర్యాపేట.. మహబూబాబాద్.. జనగాం.. ఖమ్మం జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం 6.7 టీఎంసీల సామర్థ్యంతో ములుగు జిల్లాలో దీన్ని నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా 90 కిలోమీటర్ల టన్నెల్ నెట్ వర్కుతో పాటు భారీ ఇంజనీరింగ్ డిజైన్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా చెబుతారు. మూడు పంప్ హౌసులు.. క్రాస్ డ్రెయినేజ్ వర్క్స్ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 73 హెక్టార్ల భూభాగం నీట మునిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పరిహారం.. పునరావాసాన్ని భరించేందుకు తాము సిద్ధంగా ఉన్న విషయాన్ని ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి టీ మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
అంతేకాదు.. ఎన్ వోసీ జారీకి ముందే అడ్వాన్సు చెల్లింపులకు కూడా సాధ్యమైందని చెప్పిన నేపథ్యంలో.. తమ రాష్ట్రం వైపు నుంచి ఇవ్వాల్సిన అనుమతులకు తాము సిద్ధమని ఛత్తీస్ గఢ్ సీఎం తెలియజేశారు. పొరుగు రాష్ట్రాలతో సత్ సంబంధాలు సాగిస్తూ.. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం రేవంత్ సర్కారు ఫాలో అవుతున్న తీరును ప్రశంసించాల్సిందే. ఏమైనా.. ఈ విజయం రేవంత్ సర్కారు ఖాతాలో జమ అవుతుందని మాత్రం చెప్పక తప్పదు.