చరిత్ర చెప్పి ఎందుకు బుక్ అవుతారు రేవంత్?

ఆ పార్టీ మహిళలకు అత్యున్నత పదవుల్ని కట్టబెట్టిన విషయంలో తిరుగులేని రికార్డు ఉన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త చర్చకు తెర తీసినట్లైందని చెప్పాలి.;

Update: 2026-04-19 06:57 GMT

మహిళలకు పెద్ద పీట వేసే విషయంలో కాంగ్రెస్ కు మించింది లేదని.. ఆ పార్టీ మహిళలకు అత్యున్నత పదవుల్ని కట్టబెట్టిన విషయంలో తిరుగులేని రికార్డు ఉన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొత్త చర్చకు తెర తీసినట్లైందని చెప్పాలి. కాంగ్రెస్ హయాంలోనే మహిళా రాష్ట్రపతి.. ప్రధానమంత్రిగామహిళలు ఎంపిక అయ్యారని.. స్పీకర్ గా.. పార్టీ అధ్యక్షులుగా మహిళలు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీకి అధ్యక్షులుగా ఎప్పుడూ మహిళలు ప్రాతినిధ్యం వహించలేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇంతకూ ఆయన అన్నట్లుగా ఏ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరాన్ని తీసుకొచ్చాయి. నిజంగానే సీఎం రేవంత్ మాటల్లో నిజం ఎంత? అన్నది చూస్తే.. ఆసక్తికర కోణాలు కనిపిస్తాయి.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ తిరుగులేని అధిక్యను ప్రదర్శిస్తుంది. దాదాపు 54 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్ తొలిస్థానంలో నిలిస్తే.. బీజేపీ రెండోస్థానంలో నిలుస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు బీజేపీ కేంద్రంలో 18 సంవత్సరాలకు పైనే అధికారంలో ఉంది. ఇందులో మోడీ ప్రస్తుత కాలాన్ని మినహాయిస్తే.. ఆ పార్టీ చాలా తక్కువ కాలం అధికారంలో ఉందని చెప్పాలి.

ఈ సుదీర్ఘ కాలంలో ప్రధానమంత్రిగా మహిళలు ఏ పార్టీ నుంచి వచ్చారంటే.. కాంగ్రెస్ ఇందిరాగాంధీ పేరు తెర మీదకు వస్తుంది. బీజేపీలో ఎవరు కనిపించరు. అదే సమయంలో పార్టీ అధ్యక్ష పదవిని ఈ రెండు పార్టీల్లో ఎవరు ఎక్కువగా అవకాశాలు కల్పించారన్న చూస్తే.. మరో మాటకు అవకాశం లేకుండా కాంగ్రెస్ కనిపిస్తుంది. అయితే.. ఇక్కడ మరో ఆసక్తికర అంశాన్ని మర్చిపోకూడదు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఇప్పటికి దాదాపు 140 సంవత్సరాలు పూర్తైనట్లుగా చెప్పాలి. అదే సమయంలో బీజేపీని ఏర్పాటు చేసి 46 ఏళ్లు మాత్రమే. ఎక్కడైనా.. ఎప్పుడైనా పోలిక తీసుకొచ్చినప్పుడు కాలాన్ని కచ్ఛితంగా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

బీజేపీతో పోల్చినప్పుడు కాంగ్రెస్ 94 ఏళ్ల సీనియర్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచి ఇప్పటివరకు పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు అప్పచెప్పిన వైనంలో తిరుగులేని రికార్డు ఉంది. బీజేపీలో ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టినట్లుగా కనిపించదు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. పార్టీ పెట్టిన ఆరంభంలో అనీ బెసెంట్, సరోజినీ నాయుడు, నెల్లీ సేన్‌గుప్తా లాంటి మహిళలు పార్టీకి జాతీయఅధ్యక్షులుగా వ్యవహరించారు.కానీ..కాంగ్రెస్ ఎప్పుడైతే వారసత్వానికి పెద్దపీట వేయటం మొదలైందో.. గాంధీ కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ..సోనియాగాంధీలే పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరించారు.

ఇక్కడ మహిళలకు పెద్ద పీట వేసిన విషయంలో కాంగ్రెస్ లో వారసత్వ కోణం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ.. ఆ పార్టీ అంత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికి.. తాముకేంద్రంలో అధికారంలోఉన్న సమయంలో మహిళలకు కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇచ్చారా? బీజేపీ ఇచ్చిందా? అన్నది చూసినప్పుడు కచ్ఛితంగా బీజేపీదేపైచేయి అవుతుంది. అందునా.. కాంగ్రెస్ కేంద్రంలోఅధికారంలో ఉన్న కాలంతో పోలిస్తే.. బీజేపీ చాలా తక్కువ కాలం అధికారంలో ఉన్న వైనం కనిపిస్తుంది. కేంద్రంలో మంత్రిత్వశాఖల విషయానికి వస్తే..ప్రాధాన్యత లేని శాఖలు మాత్రమే మహిళలకు కట్టబెట్టారు. అందుకు భిన్నంగా బీజేపీలో మాత్రం.. సుష్మా స్వరాజ్.. నిర్మలా సీతారామన్ లాంటి సామాన్య స్థాయినుంచి ఎదిగిన మహిళా నేతలకు అవకాశాల్ని కల్పించిన పార్టీగా బీజేపీ నిలుస్తుందని చెప్పాలి.

రాష్ట్రపతి పదవిని ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్.. బీజేపీలు సరిసమానంగా కనిపిస్తాయి. అంతేకాదు..కాంగ్రెస్ తాను రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సమయాల్లో ఐదుగురు మహిళల్ని ముఖ్యమంత్రులుగాచేసింది. బీజేపీవిషయానికి వస్తే.. ఆ పార్టీ కూడా ఐదుగురు మహిళా నేతల్నిముఖ్యమంత్రులుగా ఎంపిక చేయటం కనిపిస్తుంది. కేంద్రంలో 54 ఏళ్లు. రాష్ట్రాల్లో దశాబ్దాల పర్యంతం అధికారంలో ఉండి కూడా కేవలం ఐదుగురు ముఖ్యమంత్రులను మాత్రమే మహిళల్నిఎంపిక చేయటం చూసినప్పుడు.. వారు పాలించిన సమయం.. వారు సీఎంలుగా మహిళలకు అప్పజెప్పిన వైనం చూస్తే తక్కువగా కనిపిస్తుంది.

అదే సమయంలో.. బీజేపీ తాను కేంద్రంలోనూ.. రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న తక్కువ కాలంలోనే ఐదుగురు మహిళల్ని ముఖ్యమంత్రులుగా చేయటం చూస్తే.. ప్రాధాన్యత ప్రకారం మహిళలకు పెద్ద పీట వేసిన విషయంలో బీజేపీనే కనిపిస్తుంది. చరిత్రను చూసినా..గణాంకాల్నిచూసినా ఇదంతా కనిపించే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ మహిళలకు పెద్ద పీట వేస్తుందన్న వాదనలో పస లేదన్న విషయం అర్థమవుతుంది. మిగిలిన రాష్ట్రాల సీఎంలతో పోలిస్తే.. సీఎం రేవంత్ కాస్తంత హుషారు..చురుగ్గా ఉన్న ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. ఇలాంటి వేళ.. ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేయటం తర్వాతి కాలంలో ఆయనకే నష్టం వాటిల్లేలా చేస్తాయన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది.

Tags:    

Similar News