ఊహించనిరీతిలో రేవంత్ సర్కార్ సంక్రాంతి గిఫ్టు
సంక్షేమం పేరుతో తాయిలాలు ప్రకటించటం ప్రభుత్వాలకు పరిపాటే. అందునా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇవేమీ కొత్తేం కావు;
సంక్షేమం పేరుతో తాయిలాలు ప్రకటించటం ప్రభుత్వాలకు పరిపాటే. అందునా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇవేమీ కొత్తేం కావు. ఓట్ల లెక్కలకు అనుగుణంగా ప్రకటించే తాయిలాలు.. సంక్షేమపథకాలకు భిన్నంగా ప్రజలందరికి.. ప్రజలు కోరే.. వారి మనసుల్ని మెచ్చే నిర్ణయాలు తీసుకోవటం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందునా.. నిత్యం పేద వర్గాలకే తప్పించి.. మధ్యతరగతి వారి మనసుల్ని దోచేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేదన్న కంప్లైంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై వినిపిస్తూ ఉంటుంది.
ఈ వాదన సరికాదని..మధ్యతరగతి వారి గురించి తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని.. వారికి కష్టం కలగకుండా.. ప్రతి ఏడాది వారి ఎదుర్కొనే ఇబ్బందుల్ని తాము పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఉన్నామనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా రేవంత్ సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మహానగరం నుంచి అటు ఏపీకి.. ఇటు తెలంగాణలోని గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు వెళ్లటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పండుగ రోజుల్లో ప్రజారవాణా కష్టం కావటం.. గ్రామాలకు నేరుగా వెళ్లేందుకు వీలైన సౌకర్యాలు తక్కువగా ఉండటంతో ఎవరికి వారు తమ సొంత వాహనాల్లో వెళుతున్న వైనం తెలిసిందే.
అయితే..ఇందుకు టోల్ బూత్ లు ఎన్ని తలనొప్పులు తీసుకొస్తాయో తెలిసిందే. పండుగ వేళల్లో.. అందునా సంక్రాంతి లాంటి పర్వదినాల సందర్భంగా గంటల కొద్దీ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ నెలకొనటం తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకు వీలుగా రేవంత్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్లే వాహనాల టోల్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించే వీలుగా తాజాగా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించనప్పటికి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
సంక్రాంతి వేళలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం కావటం..గంటల కొద్దీ ప్రయాణ సమయం వేస్ట్ కావటం తెలిసిందే. పండక్కి ముందు వెళ్లే వేళలోనూ.. తిరిగి వచ్చే సమయంలోనూ ఇలాంటి సీన్ రిపీట్ అవుతూ వస్తోంది. దీనికిచెక్ పెట్టేలా సంక్రాంతి పర్వదినాలకు సంబంధించి ఐదు నుంచి ఏడు రోజుల వరకు టోల్ ఛార్జీలను తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ఇందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. జాతీయరహదారుల నిర్వహణ కేంద్రం పరిధిలో ఉన్న నేపథ్యంలో.. సంక్రాంతి పండక్కి టోల్ ప్లాజాల వద్ద నెలకొనే రద్దీ.. ట్రాఫిక్ జాంలను నివారించేందుకు వీలుగా పరిమిత సంఖ్యలో టోల్ ప్లాజాలతో పని లేకుండా వాహనాలు ప్రయాణించేలా నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ఆదాయాన్ని తెలంగాణప్రభుత్వం భరిస్తుందని.. ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామన్న ప్రతిపాదనను కేంద్రానికి పంపింది రేవంత్ సర్కారు. దీనికి కేంద్రం సైతం అభ్యంతరం చెప్పటానికి ఏమీ లేదు. దీంతో.. సంక్రాంతి పండక్కి రేవంత్ సర్కారు ఇస్తున్న గిఫ్ట్ అందరి మనసు దోచుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.