మంత్రి పదవి కోసం రామోజీ వద్దకు..!! సీఎం చెప్పిన సరదా సంఘటన

ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని బహిర్గతం చేశారు.;

Update: 2025-11-17 05:00 GMT

ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని బహిర్గతం చేశారు. మీడియా సంస్థల అధిపతిగా రామోజీరావు కోసం చాలా మంది చాలా అనుకుంటారు. కానీ, నాకు ఆయనతో ఉన్న ఒక అనుభవాన్ని పంచుకుంటా అంటూ గతాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పట్లో నేను మరో నలుగురు మిత్రులం రామోజీరావును కలవాలని అనుకున్నాం.. అప్పట్లో 2009 శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చేందుకు నెలరోజుల సమయం ఉంది. మా ప్రభుత్వం వచ్చేటట్లు ఉందని మేము లెక్కలు వేసుకున్నాం. రామోజీరావును కలవాలని నిర్ణయించుకున్నా’మని రేవంత్ రెడ్డి వివరించారు.

‘‘ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక ఉంటుంది కదా! నలుగురు మిత్రులం కలిసి రామోజీరావును కలిసేందుకు అపాయిట్మెంటు తీసుకుని ఫిలింసిటీకి వెళ్లాం.. మా నడక, మా వ్యవహారం అన్నీ ముందే గమనించారు ఆయన. మా చూపుల్నిబట్టి ఆయనకు ముందే అర్థమైపోయింది. వీళ్లేదో మంత్రి పదవులు పైరవీ కోసం వచ్చినట్లున్నారని, కూర్చోబెట్టి రాజకీయాలు, ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడారు. మేము అడగక ముందే.. నేన ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వాలని ఎప్పుడూ చంద్రబాబుకు చెప్పలేదు. నా దగ్గరికి ఎవరొచ్చినా మంత్రులుగా కంటే ఎమ్మెల్యేలుగానే రాణిస్తారని సూచిస్తుంటా...మీ నలుగురికి అదే సూచన’ అని రామోజీరావు చెప్పారు అని నాటి ఘటనను మరోసారి గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

రామోజీరావు మంచి హోస్ట్, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. సీఎంగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయం ప్రస్తావిస్తారని అనుకున్నా, కానీ ఆయనేమీ మాట్లాడలేదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం రామోజీరావు జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఫిలింసిటీలో జరిగిన కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరైనా ఇద్దరు ముఖ్యమంత్రుల ఫొటోలు, వారిద్దరూ కలిసి మాట్లాడుకున్న వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

తన రాజకీయ గురువు చంద్రబాబుతో మనసారా మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు చెప్పడం విశేషం. 2006లో తెలుగుదేశంలో చేరిన రేవంత్ రెడ్డి చక్కని మాటతీరుతో టీడీపీలో అతితిక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన 2009లో కొడంగల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ సమయంలో టీడీపీ గెలిస్తే రేవంత్ రెడ్డి మంత్రి అవుతారని ఆశించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడలేదు. కానీ, అప్పట్లో తన ప్రయత్నాన్ని సీఎం హోదాలో ఉండగా ఇప్పుడు బయటపెట్టడంతో అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News