రాఫెల్ పై రేవంత్ వ్యాఖ్యలు.. బీజేపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్!
ఇందులో భాగంగా... సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడిన నిరాధారమైన ఆరోపణలని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్.;
ఆపరేషన్ సిందూర్ వల్ల భారత్ కు జరిగిన నష్టాన్ని, కోల్పోయిన ఆయుధాల వివరాలను వెల్లడించాలంటూ కాంగ్రెస్ నేతలు.. నరేంద్ర మోడీ అండ్ కో ను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆపరేషన్ సిందూర్ లో పాక్ చేతిలో ఎన్ని రాఫెల్ విమానాలు కూలిపోయాయనే విషయంపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఫైరవుతున్నారు.
అవును... మే 29న హైదరాబాద్ లోని "జై హింద్" ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు! ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ లో పాక్ చేతిలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కచ్చితమైన సమాధానం చెప్పాలని కోరారు. దీంతో.. ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా తగులుకున్నారు.
ఇందులో భాగంగా... సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడిన నిరాధారమైన ఆరోపణలని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఆర్మీ మనోభవాలను గాయపరచడంతో పాటు దేశాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో... కాంగ్రెస్ నేతలు మోడీ, బీజేపీపై ఉన్న అక్కసును ఆర్మీ మీద, దేశంపైనా వెల్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడటం దేనికి సంకేతం అని ప్రశ్నించిన లక్ష్మణ్... ఉగ్రవాదాన్ని మోడీ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నరని అన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారత పౌరులంతా తీవ్రంగా పరిగణించాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
అదేవిధంగా రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ... వారి నాయకుడు రాహుల్ గాంధీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకూ.. మన ధైర్య సాయుధ దళాలను కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ కించపరుస్తోందని.. వారు సర్జికల్ దాడులను ప్రశ్నించడం ఇదే తొలిసారి కాదని.. శత్రువుల భాష మాట్లాడమూ వారికి ఇదే మొదటిసారి కాదని అన్నారు.
కాగా... హైదరాబాద్ లోని "జై హింద్" ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ట్ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారని.. తెలంగాణలో తయారైన విమానాలు దేశ గౌరవాన్ని నిలబెట్టాయని.. కానీ, మోడీ తెచ్చిన రాఫెల్ విమానాలను మాత్రం పాకిస్థాన్ కూల్చివేసిందని.. అలా కూలిన విమానాల లెక్కలు చెప్పాలని అన్నారు.
ఇదే సమయంలో నాలుగు రోజుల యుద్ధం తర్వాత.. ఎవరు ఎవరిని బెదిరించారో, ఎవరు ఎవరికి లొంగిపోయారో తెలియదు కానీ.. అకస్మాత్తుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బయటకు వచ్చి యుద్ధాన్ని ఆపేసినట్లు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు! దక్షిణాసియా పటాన్ని మార్చడానికి వచ్చిన అవకాశాన్ని మోడీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని తెలిపారు.