రేవంత్ ఎవరిని ఎక్కువగా ద్వేషించరా?
గతానికి భిన్నంగా వర్తమానంలో రాజకీయ ముఖచిత్రం.. రాజకీయ వైరం.. శత్రుత్వం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో విధానాల పరంగా తప్పించి.. వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే శత్రుత్వం ఉండేది కాదు.;
గతానికి భిన్నంగా వర్తమానంలో రాజకీయ ముఖచిత్రం.. రాజకీయ వైరం.. శత్రుత్వం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో విధానాల పరంగా తప్పించి.. వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే శత్రుత్వం ఉండేది కాదు. గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాజకీయాల్లో అందుకు భిన్నమైన సీన్ కనిపిస్తోన్న పరిస్థితి. ఇక.. పాలకుడికి నచ్చని వారికి చుక్కలు చూపించే ప్రోగ్రాం పాతదిగా మారింది. ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మిగిలిన వారికి భిన్నమైన సీన్ చూపిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒకరి మీద కారణంతో కానీ.. అకారణంగా కానీ కోపం వస్తే.. అది తగ్గటం ఒక పట్టాన ఉండదని చెబుతారు. ఈ విషయానికి రేవంత్ మినహాయింపుగా చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా తాజాగా చోటు చేసుకున్న ఒక ఆసక్తికర అంశాన్ని చెబుతున్నారు. కేసీఆర్ హయాంలో ఆగిన తెలుగు చిత్రపరిశ్రమ అవార్డుల వ్యవహారం రేవంత్ ప్రభుత్వం మాత్రం దానికి గద్దర్ అవార్డుల పేరుతో ఎంపిక చేయటం తెలిసిందే.
ఇందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పేరును ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 చిత్ర విడుదల సందర్భంగా చోటు చేసుకున్ పరిణామాలు.. తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు కావటం.. ఒక రోజు చంచలగూడ జైల్లో ఉండటం లాంటి సన్నివేశాలు తెలిసిందే. కట్ చేస్తే.. తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో అల్లు అర్జున్ ను ఉత్తమ నటుడి అవార్డును ప్రకటించటం ద్వారా.. రేవంత్ కు ఎవరి మీదా కోపం చాలా త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు.
నిజానికి.. ఇలాంటి తీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి అవసరం కూడా. విధానాలపరంగా విభేదించటం వేరు.. అదే పనిగా కత్తి పట్టుకొని.. ఎప్పుడు దొరుకుతారా? అన్నట్లుగా వ్యవహరించటం కూడా మంచిది కాదు. ఈ విషయంలో రేవంత్ పాత కల్చర్ ను కొత్తగా గుర్తు చేస్తున్నారని చెప్పాలి. రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య నడిచిన పంచాయితీ లాంటిది మరే ముఖ్యమంత్రికి ఎదురైనా.. అవార్డుల ప్రకటనల్లో వారి పేరు కనిపించేది కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఒక్క అల్లు అర్జున్ విషయంలోనే కాదు.. టాలీవుడ్ సీనియర్ నటుల్లో ఒకరైన కింగ్ నాగార్జున ఎపిసోడ్ లోనూ ఇలాంటి సీనే చోటు చేసుకున్నట్లుగా గుర్తు చేసుకుంటున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో యమా స్ట్రిక్టుగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం.. తర్వాతి కాలంలో నాగార్జునను దూరం పెట్టింది లేదు. అలా అని దగ్గరకు తీసుకున్నది లేదు. ఇటీవల నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్.. కింగ్ నాగార్జున ఒకేచోట కూర్చోవటం.. సరదాగా మాట్లాడుకున్న ద్రశ్యాలు టీవీ చానళ్లలోనూ.. ఫోటోల రూపంలోనూ బయటకు వచ్చాయి.
దీన్ని చూసిన వాళ్లు.. సీఎం రేవంత్ తీరును అభినందిస్తున్నారు. ఏమైనా.. తన ఆగ్రహం పాలు పొంగుదే తప్పించి.. టార్గెట్ చేసినట్లుగా ఉండదన్న విషయాన్ని సీఎం రేవంత్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఇలాంటి తీరు అందరికి మంచిదే. పాలకుడికి కోపం రావటం తప్పు కాదు. కానీ.. దాన్ని అదే పనిగా కంటిన్యూ చేయటమే చేయకూడదు. ఆ లక్ష్మణ గీతను రేవంత్ బాగానే గుర్తించినట్లుగా చెప్పాలి.