అమీర్ పేట చౌరస్తాలో సీఎం రేవంత్ స్పీచ్.. ఎప్పటికి మర్చిపోలేరంతే!

నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఇక్కడి ప్రజలకు, ఎన్టీఆర్ అభిమానులకు ఒక మాట ఇచ్చాను.

Update: 2026-05-29 04:37 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధిస్తే.. అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన ఎన్నికల హామీని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయం నేపత్యంలో.. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడి ఆర్నెల్లు కాకముందే.. అమీర్ పేట చౌరస్తాలో.. కూతవేటు దూరంలో మైత్రీవనం.. మరో వైపు సారధి స్టూడియో దగ్గర్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించటం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

మంచి మాటకారి అయిన ముఖ్యమంత్రి.. తన మాటలతో మాత్రమే కాదు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం హోదాలో ఆవిష్కరించటానికి మించింది మరేం ఉంటుందంటూ భావోద్వేగానికి గురైన తీరు చూసినప్పుడు.. రోటీన్ రాజకీయాలకు భిన్నంగా సీఎం రేవంత్ వ్యవహారశైలి కనిపిస్తుందని చెప్పాలి. విగ్రహావిష్కరణ సందర్భంగా రాజకీయ.. సామాజిక.. ప్రాంతీయ అంశాల్ని ప్రస్తావించటం.. కొన్ని సందర్భాల్లో తాను మాట్లాడే మాటల్ని మనసుల్లో నుంచి వచ్చినట్లుగా చెప్పిన వైనం కట్టిపడేసేలా మారింది. మొత్తంగా చూస్తే..ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటుందని చెప్పాలి.

ప్రతి తెలుగువాడికి సుపరిచితమైన అమీర్ పేట.. మైత్రీవనం చౌరస్తాలో సీఎం రేవంత్ చేసిన ప్రసంగంలోని కొన్ని కీలక అంశాల్ని ఆయన మాటల్లోనే చెబితే..

- నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఇక్కడి ప్రజలకు, ఎన్టీఆర్ అభిమానులకు ఒక మాట ఇచ్చాను. గత ప్రభుత్వం అమీర్‌పేట చౌరస్తాలో అన్నగారి విగ్రహం పెట్టకుండా అడ్డుకుంటే, మన ప్రభుత్వం రాగానే ఇదే మైత్రీవనం కూడలిలో అధికారికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి, నేనే స్వయంగా ఆవిష్కరిస్తానని నాడు హామీ ఇచ్చాను.

- ఈ రోజు ఆ మాటను నిలబెట్టుకున్నందుకు, అన్నగారి 23 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు దక్కినందుకు గర్వపడుతున్నా. ఈ భూమి మీద ఎంతో మంది పుడతారు, చనిపోతారు. కానీ కొందరు మాత్రమే చరిత్రగా మారుతారు. ఎన్టీఆర్ గారు కేవలం ఒక నటుడు, ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు; ఆయన తెలుగు జాతికి ఒక బ్రాండ్.

- కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కొందరు చేసిన సంకుచిత విమర్శలను చేస్తున్నారు. నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని. నా పక్కన ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడే ఉన్నారు. మేమిద్దరం కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లమే అయినా, తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని తెచ్చిన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని సగర్వంగా ఆవిష్కరిస్తున్నాం

- ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయే యుగపురుషుడు. మద్రాసు (ఇప్పటి చెన్నై) వీధుల్లో తెలుగువాళ్లమని చెప్పుకోవడానికి సంకోచించిన రోజుల్లో, 'మేము తెలుగువాళ్లం' అని మన ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంతవరకు ఆయన కీర్తి సజీవంగా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఆయన చేసిన విప్లవాత్మక మార్పులు దేశ రాజకీయాలనే శాసించాయి.

- తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. అదో పేరు కాదు. తెలుగు చలనచిత్ర.. రాజకీయ రంగాల్లో ఒక సువర్ణశకం. సమాజంలో వెనుకబడిన వర్గాలకు.. పేదలకు రెండురూపాయిల కిలో బియ్యం.. జనతా వస్త్రాలు.. పక్కా గృహాల లాంటి విప్లవాత్మక పథకాల్ని అందించి.. పేదవారి గుండెల్లో నిలిచిపోయారు.

- సామాన్యులను.. యువకులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. వారికి అసెంబ్లీలో.. పార్లమెంట్ లో కూర్చునే అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే. పటేల్ - పట్వారీ వ్యవస్థ రద్దు.. మండల వ్యవస్థ పరిచయం లాంటి చర్యలతో పరిపాలనను ప్రజల వద్దకు చేర్చారు.

- ఆనాడే ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించి, స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యానికి పునాది వేశారు.ఈ రోజు మనం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలకు ఆనాడే ఎన్టీఆర్ బీజం వేశారు. రాజకీయం అంటే కొందరి సొత్తు మాత్రమే కాదు అని నిరూపించిన ఘనత ఎన్టీఆర్ దే.

- సమాజంలో అట్టడుగున ఉన్న సామాన్యులను, యువకులను, చదువుకున్న మేధావులను వెతికి పట్టుకుని వారికి రాజకీయాల్లో అవకాశం ఇచ్చారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని సామాన్య కార్యకర్తలను శాసనసభకు, పార్లమెంట్‌కు పంపి ప్రజాస్వామ్యాన్ని నిజమైన అర్థంలో ప్రజల వద్దకు చేర్చారు.

- హైదరాబాద్ లోనే అత్యంత రద్దీగా ఉండే.. యువత ఎక్కువగా ఉండే అమీర్ పేట మైత్రీవనం చౌరస్తాలో విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరం. దేశ విదేశాలకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, యువత సంచరించే ఒక చైతన్య కేంద్రం. ఇక్కడికి వచ్చే ప్రతి యువకుడు, చదువుకునే విద్యార్థి ఈ విగ్రహాన్ని చూసినప్పుడు.. 'సమాజంలో ఏ రంగంలోనైనా క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎన్టీఆర్ లాగా అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చు' అనే నిండైన ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. ఈ విగ్రహం రాబోయే తరాలకు నిరంతర స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

- ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కేసీఆర్‌కు అసలు రాజకీయ భిక్ష పెట్టింది అన్న నందమూరి తారకరామారావు గారే. న్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారానే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చి, సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచి, అన్నగారి క్యాబినెట్‌లో మంత్రిగా పదవులు అనుభవించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ నుంచి ఎన్టీఆర్ పేరును, ఆయన గుర్తులను పూర్తిగా తుడిచిపెట్టేయాలని కేసీఆర్ కుట్రలు చేశారు.

- ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న ఎంతో మంది నేతలకు రాజకీయ జన్మ నిచ్చింది, వారికి వేదిక కల్పించింది అన్నగారే. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు మాత్రమే కాదు.. నేటి తరం రాజకీయాల్లో ఉన్న వందలాది మంది కీలక నాయకులు ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం, అవకాశాల వల్లే ఈ స్థాయికి వచ్చారు. ఆయన ఒక నాయకులను తయారు చేసిన ఫ్యాక్టరీ.

- అమీర్‌పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టనివ్వకుండా గత ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించింది. జీహెచ్ఎంసీ అధికారులతో అనుమతులు రాకుండా వేధించింది. అసలు ఎన్టీఆర్ అనే మహానుభావుడు తెలుగు గడ్డపై రాజకీయ విప్లవం తీసుకురాకపోతే, సామాన్యులకు పదవులు ఇవ్వకపోతే.. ఈ రోజు కేసీఆర్ గానీ, ఆయన కుటుంబం గానీ నాయకులు అయ్యేవారా?

- రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆర్‌ను వాడుకుని, అధికారంలోకి వచ్చాక ఆయనను అవమానించేలా ప్రవర్తించడం కేసీఆర్ కృతజ్ఞతా రహిత్యానికి నిదర్శనం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారంటూ కొందరు బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి వారికి నేను చెప్పేదొక్కటే.. ఎన్టీఆర్ ఏ ఒక్క వర్గానికో, ప్రాంతానికో, పార్టీకో పరిమితమైన వ్యక్తి కాదు.ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత.

- అందుకే.. మేం అధికారంలోకి రాగానే గత పాలకుల అడ్డంకులను తొలగించి, ఇచ్చిన మాట ప్రకారం అధికారికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడమేంటి అని ట్విట్టర్‌లో కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు. అసలు నీకు తారకరామారావు అనే పేరు ఎలా వచ్చింది? నీ తండ్రి కేసీఆర్ గారు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే నీకు ఆ పేరు పెట్టారు. నీ పేరులోనే ఎన్టీఆర్ ఉన్నారు. కానీ అన్నగారి బావమరిది హరికృష్ణ గారి అల్లుడు (నవీన్ యాదవ్ - జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే) ఇక్కడ విగ్రహం పెట్టిస్తుంటే.. కనీసం ఆ పేరు ఉన్నందుకైనా నువ్వు సంతోషపడాలి కానీ, ఇలా ట్వీట్లు చేస్తూ అడ్డుపడటం ఏంటి?

- అధికారంలో ఉన్నప్పుడు విగ్రహాన్ని పెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. అధికారం పోయినా ఇంకా అహంకారంతో ట్విట్టర్ లో కామెంట్లు చేస్తున్నారు. ఈ దేశం ఉన్నంత కాలం.. ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, నందమూరి తారకరామారావు గారు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.

- ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, పేదల ఆకలి తీర్చడం కోసం పరితపించిన మహోన్నత నాయకులని, ఇలాంటి చారిత్రక పురుషులను ఏ ఒక్క పార్టీకో పరిమితం చేసి చూడటం సంకుచితత్వమే అవుతుంది.

- మాలాంటి ప్రజా పాలకులం ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి, వారి ఆకాంక్షలను నెరవేరుస్తాం. కొందరిలాగా ఎన్నికలు అయిపోగానే, అధికారం పోగానే ఫామ్‌హౌస్‌కు పరిమితమవ్వం. గత పాలకులు పదేళ్లపాటు అధికార గర్వంతో విర్రవీగారు. అందుకే ప్రజలు వారిని ఫామ్‌హౌస్‌కు పంపించారు. ఎన్టీఆర్ సినిమాల్లో కేవలం నటుడిగా కాకుండా, సమాజంలోని అసమానతలను ప్రశ్నించే పాత్రల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు.

- రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, తెలుగు జాతికి దిశానిర్దేశం చేసిన ఎన్టీఆర్ లాంటి మహానుభావుల విషయంలో మా ప్రభుత్వం ఎప్పుడూ గౌరవంగానే ఉంటుంది. వారి విగ్రహాల ఏర్పాటును రాజకీయం చేయవద్దు.

- గత పాలకుల లాగా కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మా సంస్కృతి కాదు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీ పెట్టినప్పటికీ, తెలుగు జాతికి ఆయన చేసిన సేవలను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తుంది. గతంలో ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేలా చేసింది ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డే. ఇప్పుడు అదే బాటలో, గత బీఆర్ఎస్ పాలకుల అడ్డంకులను తొలగించి, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, టీపీసీసీ అధ్యక్షుడితో కలిసి నేను ఈ 23 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం చారిత్రాత్మక అవసరం.

- మహానుభావులను పార్టీల రంగులు చూసి గౌరవించకూడదని, జాతి నేతలను అందరూ గౌరవించాలనే సరికొత్త రాజకీయ సాంప్రదాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Tags:    

Similar News