కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏమి జరుగుతుంది ?
కేసీఆర్ తెలంగాణాను పదేళ్ళ పాటు పాలించిన నాయకుడు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన నేతగా పేరుంది.
కేసీఆర్ తెలంగాణాను పదేళ్ళ పాటు పాలించిన నాయకుడు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన నేతగా పేరుంది. తొలి ముఖ్యమంత్రిగా రికార్డు ఉంది. ఇక వరసగా 2023లో కూడా గెలిచి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాలని కేసీఆర్ చాలా ఆలోచించారు. కానీ ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారు. ఇక గడచిన రెండున్నరేళ్ళుగా ఒకటి రెండు సందర్భనాల్లో తప్ప కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు, అయితే కేసీఆర్ సభకు రావాలని ఇప్పటికి అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. తాజాగా ఆయన పరకాలలో జరిగిన బహిరంగ సభలో ఇదే రకంగా సవాల్ రేవంత్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పదేళ్ళ ఆయన పాలన రెండేళ్ళ తన పాలన మీద చర్చను పెడతామని రేవంత్ అన్నారు.
ఫ్యామిలీ జస్టిస్ అంటూ :
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఫ్యామిలీ జస్టిస్ కోసమే పాటు పడతారు అని రేవంత్ రెడ్డి సెటైర్లు పేల్చారు. అదే తాము అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. తమది సోషల్ జస్టిస్ అయితే కేసీఆర్ ది పూర్తిగా ఫ్యామిలీ జస్టిస్ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన కుమారుడు కుమార్తె మేనల్లుడు ఇంకా బంధువులకే పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. ప్రజల కోసం ఆయన ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యరని, గిరిజన మహిళ సీతక్క మంత్రి అయిందని చెప్పారు. మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్ ని మంత్రిని చేశామని గుర్తు చేశారు.
అప్పు మీద చర్చించాలి :
పదేళ్ళ పాలనలో కేసీఆర్ తెలంగాణాకు అక్షరాలా ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పులను మిగిలించారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం గా తయారు అయింది అని అన్నారు. గత రెండేళ్ళలో గాడిన రాష్ట్రాన్ని పెడుతున్నామని అన్నారు. అసెంబ్లీని పెట్టమని పదే పదే కేటీఆర్ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు అని సెప్టెంబర్ నెలలో అసెంబ్లీని పెడతామని దమ్ముంటే కేసీఆర్ ని బావా బావమరుదులు అసెంబ్లీకి తీసుకుని రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎన్నో విషయాలు చర్చించాల్సి ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
వచ్చే సీన్ ఉందా :
నిజానికి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ సభలో హరీష్ రావు కేటీఆర్ నే విపక్ష పాత్రలో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే కేసీఆర్ వస్తేనే సభలో చాలా విషయాలు చర్చించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆయన పాలనలో అభివృద్ధి సంక్షేమం తమ పాలనలో సంక్షేమం ప్రగతి మీద ఎంత సమయం కావాలంటే అంత సమయం చర్చించడానికి తాను తయారుగా ఉన్నాను అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ కేసీఆర్ సభకు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేవని అంటునారు. ఇప్పటికే తెలంగాణాలో సగం ప్రభుత్వ పాలన పూర్తి అయింది. దాంతో ఈసారి ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. అలా గెలిచి రాజ మార్గం ద్వారానే సీఎం గా రావాలని కేసీఆర్ చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ విపక్షంలో చూడాలని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు అంతా ఆశ పడుతున్నారు కానీ అది జరిగే వీలు లేదనే అంటున్నారు.