బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ : రేవంత్ గురి చూసి కొట్టారా ?

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాల పుట్ట అని అంటారు. ఆయన రాజకీయ అనుభవం రెండు దశాబ్దాలు పై దాటింది. అయితే ఆయన ఎత్తుగడలు అయితే ఎంతో పదును తేరి ఉంటాయి.;

Update: 2026-03-27 05:30 GMT

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాల పుట్ట అని అంటారు. ఆయన రాజకీయ అనుభవం రెండు దశాబ్దాలు పై దాటింది. అయితే ఆయన ఎత్తుగడలు అయితే ఎంతో పదును తేరి ఉంటాయి. ఆయన పొలిటికల్ గ్రాఫ్ ని ఒక్కసారిగా గమనిస్తే అన్నీ నిచ్చెనలే కనిపిస్తాయి. ఆయన అలా తన ఎదుగుదలకు ప్రతీ సందర్భాన్ని సోపానంగా మార్చుకున్నారు. తాను పనిచేసిన పార్టీలలో సైతం అగ్ర నాయకత్వానికి అతి చేరువగా ఉంటూ తన సామర్ధ్యంతో మెప్పు పొందారు. ఇక రాజకీయాలలో వర్తమానంతో పాటు భవిష్యత్తుని సైతం ఊహించి దానికి అనుగుణంగా పధక రచన చేసుకోవడం ఎంతో అవసరం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి బాగానే రాటు దేలారు అని ఆయన వైఖరిని బట్టి తెలుస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఆ రెండు పార్టీలు :

తాజాగా రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలను పంచుకున్నారు. తన ఆలోచనల గురించి కూడా స్పష్టం చేశారు. తెలంగాణా రాజకీయ వాతావరణాన్ని కళ్లకు కట్టారు. రాజకీయ మైదానంలో ఉన్న తన ప్రత్యర్ధుల బలాలు బలహీనతలు సరిగ్గా అంచనా వేసి మరీ విమర్శలు చేశారు. ఇప్పటిదాకా చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్నీ విజయాలనే అందుకుంది. రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు సర్పంచు ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో సైతం భారీ ఆధిక్యంతో అత్యధిక సీట్లను గెలుచుకుంది. దాంతో మరో మూడేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ధీమాను కాంగ్రెస్ క్యాడర్ లో కలిగించగలిగారు రేవంత్ రెడ్డి. ఈ నేపధ్యంలో విడిగా బీఆర్ఎస్ బీజేపీ పోటీ చేస్తున్నాయి. దాంతో ఆ రెండు పార్టీలు కలిస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా ఉంది.

త్రిముఖ పోరు అడ్వాంటేజ్ :

ఎపుడైనా అధికారంలో ఉన్న పార్టీకి ఉండే వ్యతిరేకత గంప గుత్తగా ఒకే పార్టీ వైపు సాగితే అపుడు ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా చీలిపోతే మాత్రం అడ్వాంటేజ్ అవుతుంది అన్న రాజకీయ లెక్క ఉంది. తెలంగాణాలో చూస్తే బీఆర్ఎస్ బీజేపీ విడిగా పోటీ చేయడం వల్లనే కాంగ్రెస్ కి విజయాలు దక్కుతున్నాయని ఒక చర్చ సాగుతోంది. బహుశా దానిని దృష్టిలో ఉంచుకునే కాబోలు రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు అని అంటున్నారు. విడిగా ఎందుకు రెండు పార్టీలు ఒక్కటిగా కలిసి రావాలని బీజేపీకి బీఆర్ఎస్ కి ఆయన సవాల్ చేశారు. ఇద్దరూ ఒక్కటిగా వస్తే కలసి ఓడించాలన్నది తన ఆలోచనగా చెప్పారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ కామెంట్స్ చేశారు అంటే మ్యాటర్ అక్కడే ఉంది అని అంటున్నారు.

ప్రతికూలంశమేనా :

పలు పార్టీలు కలిస్తే విజయం అన్నది ఏపీ ఎలక్షన్ 2024లో నిరూపించింది. అక్కడ వైసీపీని గద్దె దించేందుకు మూడు పార్టీలు ఒక్కటి అయ్యాయి. ఎన్డీయేగా ఏర్పడ్డాయి. దాంతో వైసీపీ భారీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరి భారీ లాభాని పొందింది. మరి అదే వ్యూహాన్ని తెలంగాణా రాజకీయాల్లోనూ అమలు చేస్తుందా అన్న చర్చ అయితే ఉంది. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే బలమైన కూటమిగా ఏర్పాటు అవుతుందని దాంతో కాంగ్రెస్ ని ఓడించవచ్చు అని ప్రచారం అయితే సాగుతోంది. అయితే అదే సమయంలో ఈ పొత్తుల వల్ల ఎంత అనుకూలత ఉంటుందో తెలియదు కానీ ప్రతికూలత సైతం ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి.

ఓటు బ్యాంక్ ఆ వైపుగా :

కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ. ఆ పార్టీ వైపు సహజంగానే మైనారిటీలు ఉంటారు. ఇక బీఆర్ఎస్ కూడా సెక్యులర్ స్టాండ్ తో ఉన్నంతవరకూ ఆ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి కూడా దక్కుతుంది. కానీ ఎపుడైతే బేజేపీతో జట్టు కడుతుందో అపుడు మైనారిటీలతో పాటు కొన్ని సామాజిక సెక్షన్లు దూరం అవుతాయని ప్రచారం ఉంది. 2023 ఎన్నికలో బీఆర్ స్ కి 37.35 శాతం ఓటు షేర్ వచ్చింది. బీజేపీకి అయితే 13.90 శాతం ఓటు షేర్ వచ్చింది. ఇక కాంగ్రెస్ కి 39.40 శాతం ఓటు షేర్ వచ్చింది. ఈ లెక్క తీసుకుంటే బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ అంటే 51 శాతం ఓటు షేర్ ఉంటుంది అని అంటున్నారు దాంతో దాదాపుగా స్వీప్ చేసే చాన్స్ వస్తుందని అంటున్నారు.

తెర వెనక ఏమి జరుగుతోందో :

అయితే విడిగా పోటీ చేస్తే ఏ పార్టీకి ఆ పార్టీని మెచ్చే వర్గాలు ఉంటాయని కలిస్తే ఆ వర్గాలు అన్ని కలసి కాంగ్రెస్ వైపు మళ్ళితే అపుడు పొత్తు చిత్తు అవుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. బహుశా ఈ రకమైన ప్రచారం సాగుతున్న నేపధ్యంలోనే ఎందుకొచ్చిన చర్చలు అన్నట్లుగా నేరుగా సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి పెద్ద సవాల్ విసిరారు. మరి బీఆర్ఎస్ బీజేపీ నిజంగా కలుస్తాయా కలిస్తే ఏపీ లాగా కూటమిగా అధికారంలోకి వస్తారా లేక రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఓడిపోతారా అసలు ఈ ప్రచారంలో నిజమెంత అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తానికి తెర వెనక ఏమి జరుగుతోందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి అయితే గురి చూసి కొట్టారని అంటున్నారు.

Tags:    

Similar News