ఒక వేళ కాంగ్రెస్ గెలిస్తే.. ఏమవుతుంది?

ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే.. ప్రతిపక్షాలపై పైచేయి సాధించడం ఏమో కానీ, ఆ పార్టీ అంతర్గత రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.;

Update: 2025-11-12 15:30 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సరికొత్త చర్చకు తెరతీశాయి. పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సంస్థలు అధికార కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని స్పష్టం చేశాయి. ఇదే సమయంలో పోలింగ్ సరళిని చూసిన తర్వాత బీఆర్ఎస్ లో కొంత నిస్తేజం కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. అయినా ప్రజల మనసులో ఏముందనేది ఈ నెల 14నే అధికారికంగా తేలనుంది. అయితే సర్వే సంస్థల అంచనాలు తర్వాత నిజంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం జరగనుందనేది విస్తృత చర్చకు దారితీస్తోంది.

నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా రాష్ట్ర రాజకీయ చిత్రంలో ఎటువంటి మార్పు రాకపోవచ్చనని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ప్రతిపక్ష స్థానాల్లో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని టచ్ చేసే విషయంలో దరిదాపుల్లో కూడా లేవు. కానీ, ఈ సీటు గెలుచుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సానుకూలంగా పరిస్థితులను మార్చుకోవాలని ప్రతిపక్షాలు భావించాయి. అందుకు తగ్గట్టే ప్రచారంలో ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయాయి. అయితే అధికార పార్టీకి సహజంగా ఉండే అనుకూలతల వల్ల పోల్ మేనేజ్మెంట్ బాగా చేయడంతో ఎగ్జిట్ పోల్స్ లో సానుకూల ఫలితం సాధించిందని అంటున్నారు.

ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే.. ప్రతిపక్షాలపై పైచేయి సాధించడం ఏమో కానీ, ఆ పార్టీ అంతర్గత రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా ఈ ఉప ఎన్నికను జీవన్మరణ సమస్యగా భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో సర్వం తానై పనిచేశారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు వారం పాటు ఒక ముఖ్యమంత్రి పర్యటించడం బహుషా ఇంతకు ముందెన్నడూ జరగలేదు. కానీ, ఈ ఉప ఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు వారం పాటు పర్యటించడం, గల్లీగల్లీలో కార్నర్ మీటింగులు పెట్టడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

అదే సమయంలో పార్టీ యంత్రాంగం మొత్తాన్ని సమర్థంగా వాడుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిత్రపక్షంగా ఎంఐఎంను చేర్చుకుని మరింత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ పరిస్థితులన్నీ అనుకూలించడంతో ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిందని అంటున్నారు. ఈ అంచనాలు నిజమై కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో పాగా వేస్తే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పార్టీలో తన ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి మార్గం సుగమం అవుతుందని అంటున్నారు. రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా, ఆయనను ఢిల్లీ నుంచి కంట్రోల్ చేసేలా రాష్ట్రంలో కొందరు నాయకులు పనిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా కొంతమార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైనప్పుడు మాత్రమే జరుగుతాయని లేదంటే, ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిరావొచ్చునని అంటున్నారు.

Tags:    

Similar News