మీకు నేనున్నా: పెట్టుబ‌డి దారుల‌కు రేవంత్ హామీ!

రాష్ట్రాల‌కు పెట్టుబ‌డుల సాధ‌న‌లో ఏపీ, తెలంగాణ‌ల మ‌ధ్య పోటీ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే.;

Update: 2025-11-04 17:40 GMT

రాష్ట్రాల‌కు పెట్టుబ‌డుల సాధ‌న‌లో ఏపీ, తెలంగాణ‌ల మ‌ధ్య పోటీ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏపీ దూకుడుగా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక‌, తెలంగాణ కూడా.. దాదాపు అంతే దూకుడుగాఉంది. మంత్రి శ్రీధ‌ర్‌బాబు ఇటీవ‌ల విదేశాల్లోనూ ప‌ర్య‌టించి.. పెట్టుబడుల‌పై చ‌ర్చ‌లు జ‌రిపి వ‌చ్చారు. ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌లోనే ఉండి.. పెట్టుబ‌డుల సాధ‌న‌కు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా పెట్టుబ‌డి దారులకు ఆయ‌న అభ‌యం ప్ర‌సాదించారు. ``నేనున్నా..మీకేం ప‌ర్వాలేదు. రండి పెట్టుబ‌డులు పెట్టండి.`` అని భ‌రోసా క‌ల్పించారు. ఒకే రోజు ప‌లువురు పెట్టుబ‌డి దారుల‌తో భేటీ అయ్యారు.

1) అమెజాన్‌:

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అమెరికా దిగ్గ‌జ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చిం ది. ఈ క్ర‌మంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ప్రతినిధి బృందం మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను సీఎం వారికి వివ‌రించారు. ఏడబ్ల్యూఎస్‌ ఆన్‌ గోయింగ్‌ డేటా సెంటర్ల ఏర్పాటు, వాటి విస్త‌ర‌ణ‌లో పెట్టుబ‌డుల‌కు అపార అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. పెట్టుబ‌డులు పెట్టేవారికి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. సింగిల్ విండో ద్వారా అనుమ‌తులు.. నీరు, భూములు ఇస్తున్నామ‌న్నారు.

2) జ‌ర్మనీ కాన్సుల్‌

జర్మనీ కాన్సుల్‌ జనరల్‌(దౌత్య వేత్త‌) మైకేల్‌ హాస్పర్ నేతృత్వంలోని ప‌లువురు పెట్టుబ‌డి దారులు కూడా రేవంత్ రెడ్డితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో వారినుంచి కూడా సీఎం రేవంత్ పెట్టుబ‌డుల‌ను ఆశించారు. `డ్యుయిష్‌ బోర్స్‌` కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో జీసీసీని ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ పెట్టుబడులు పెట్టాలని కోరారు. జీసీసీ ద్వారా రానున్న‌ రెండేళ్లలో వెయ్యి మందికి పైడా ఉద్యోగ‌, ఉపాధులు లభిస్తాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఆవిష్క‌ర‌ణ‌ల కేంద్రంగా హైదరాబాద్ అవ‌త‌రించ‌నున్న‌ద‌ని తెలిపారు. తెలంగాణ ఉన్న‌త విద్యాసంస్థ‌ల్లో జ‌ర్మ‌నీని ప్ర‌వేశ పెడుతున్నామ‌ని, దానికి స‌హ‌కారం అందించాల‌ని విన్న‌వించారు.

Tags:    

Similar News