కిషన్ రెడ్డి ఇదేం బుద్ధి.. సీఎం రేవంత్ మహా సీరియస్

తాజాగా ఉప్పల్ లో చేపట్టిన పలు డెవలప్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్.. కిషన్ రెడ్డి తీరును తప్పు పడుతూ ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2026-06-08 04:26 GMT

కేసీఆర్.. కేటీఆర్ పై విమర్శలు.. ఆరోపణల గురి పెట్టే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తాజాగా మాత్రం కేంద్రమంత్రి.. బీజేపీ అధినాయకత్వం వద్ద మంచి పట్టున్న తెలంగాణ నేతగా పేరున్న కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో చేపట్టిన డెవలప్ మెంట్ మీద కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నట్లుగా ఆయన ఆరోపించారు. తాము చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వటం లేదన్న ఆయన.. బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ చెప్పినట్లే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వింటారంటూ సంచలన ఆరోపణ చేశారు. అంతేకాదు.. తుమ్మిడిహెట్టికి అనుమతులు ఇవ్వొద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కిషన్ రెడ్డి చెప్పినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఉప్పల్ లో చేపట్టిన పలు డెవలప్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్.. కిషన్ రెడ్డి తీరును తప్పు పడుతూ ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన మాటలన్ని కిషన్ రెడ్డి చుట్టూనే తిరగటం కనిపిస్తుంది. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కాలికి బలపం కట్టుకొని యాభై సార్లు ఢిల్లీకి తాను వెళ్లానని.. ఐదుసార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లుగా చెప్పిన రేవంత్.. ‘‘మెట్రో విస్తరణకు అనుమతి రాలేదు. మూసీ ప్రక్షాళన.. ట్రిపుల్ ఆర్ కు నిధులు ఇవ్వరు. ఇవన్నీ ఎందుకు ఆగుతున్నాయి? ఎవరు ఆపుతున్నారో రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి’’ అంటూ ప్రశ్నించారు.

అంతలోనే.. రాష్ట్రానికి ఏవీ దక్కుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే అంటూ సీఎం రేవంత్ ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ తో కలిసి కిషన్ రెడ్డి గూడపుఠాణి చేస్తుంటారన్న రేవంత్.. ‘‘కిషన్ రెడ్డి బీజేపీలో ఉంటారు కానీ బీఆర్ఎస్ వాళ్లతో మాట్లాడుకుంటారని.. కేటీఆరర్ చెప్పినట్లే వింటారని బీజేపీ వాళ్లే చెబుతున్నారు. మా సార్ బీజేపీల ఉంటాడు. కానీ బీఆర్ఎస్ వాళ్లతో మాట్లాడుకుంటాడు. కేటీఆర్ చెప్పినట్లే వింటాడని మీ సొంత పార్టీ వాళ్లే చెబుతున్నారు. నీకు పార్టీ మారే అవసరం ఏముంది? ఉన్న దాంట్లో ఉంటవు.. పక్క దాంట్లో తింటవు. దొంగది కాదు. దొడ్లకు రాదన్నట్లుగా నీ వ్యవహారం ఉంటుంది’’ అంటూ కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ. మేర ఉన్న మూసీని అంతర్జాతీయస్థాయిలో డెవలప్ చేస్తే.. ఆర్థికంగా, పర్యాటకంగా నగరం డెవలప్ అవుతుందన్న సీఎం రేవంత్.. న్యూయార్క్.. న్యూజెర్సీ మధ్య హట్సన్ రివర్ ఫ్రంట్ వద్ద అపార్ట్ మెంట్ల విలువ వందల కోట్లలో ఉంటుందన్నారు. కానీ మురికి వల్ల మూసీ ప్రాంతంలో భూమికి విలువ లేదన్నారు. ఈ మురికి నల్గొండ.. భువనగిరి పరిసర ప్రాంతాల్లో కొత్తగా పెళ్లైన జంటలను ప్రెగ్నెన్సీ సమస్య ఉందని ఊరి నుంచి హైదరాబాద్ కు పంపుతున్నారన్నారు.

మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయొద్దన్న సీఎం రేవంత్.. ‘ఇళ్లు పోతే ఇళ్లు. ఉపాధి పోతే ఉపాధి కల్పిద్దాం. వాళ్ల పిల్లలకు మంచి చదువులు చెప్పిద్దామంటే వద్దంటారు. అడ్డంపడతారు. నువ్వు ఇక్కడి ఎంపీవి కదా? మూసీ ప్రాజెక్టుకు నిధులు.. అనుమతులు తెస్తావా కిషన్ రెడ్డీ? ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయింది. 122 కి.మీ. మేర మెట్రోను విస్తరించాలని ప్రయత్నిస్తున్నాం. దాదాపు అన్ని అనుమతులు వచ్చాక.. ఇక్కడి నుంచి కేంద్రమంత్రిగా పని చేస్తున్న కిషన్ రెడ్డి అడ్డు పడటంతో అర్థంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది’’ అంటూ కిషన్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పు పట్టారు.

తాను పుట్టింది బీజేపీలోనే.. చచ్చేది బీజేపీలోనే అని కిషన్ రెడ్డి అంటున్నారని.. కానీ ఆయన చేతలు అలా ఉండవంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనేమన్నారన్నది సీఎం రేవంత్ మాటల్లోనే చదివితే.. ‘‘నిజమే.. అండ్లనే ఉంటవు. చీకట్ల ఇవతలోని సహకారం తీసుకుంటవు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పని చేశావా? మా సార్ బీజేపీల ఉంటడు. కానీ బీఆర్ఎస్ వాళ్లతో మాట్లాడుకుంటడు. కేటీఆర్ చెప్పినట్లే వింటడని మీ సొంత పార్టీ వాళ్లే చెబుతున్నరు. నీకు పార్టీ మారే అవసరం ఏముంటుంది? కిషన్ రెడ్డి అన్ని ప్రాజెక్టులకు అనుమతి తీసుకొస్తే.. ఎల్బీ స్టేడియంలో భారీ సభ పెట్టి సన్మానించి.. గండ పెండేరం తొడుగుతాం. తెలంగాణకు సహకారం అందించాలి. చీకట్లో బీఆర్ఎస్ తో కలిసి గూడుపుఠానీ చేయొద్దు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆర్నెల్లు రాజకీయాలు చేద్దాం. మిగిలిన సమయం కష్టపడి నగరాన్ని డెవలప్ చేసుకుందాం. నా దగ్గరకు వచ్చే ఎమ్మెల్యేలు ఏ పార్టీ అని చూడకుండా పనులు చేయించే బాధ్యత తీసుకున్నా. రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేసుకుందాం’’ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.


Tags:    

Similar News