జనసేనాని ధర్మాగ్రహం...వేటు పడుద్దంతే !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతల తీరు మీదనే ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఏకంగా జిల్లా కమిటేనే రద్దు చేశారు.

Update: 2026-06-08 04:14 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతల తీరు మీదనే ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఏకంగా జిల్లా కమిటేనే రద్దు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని రద్దు చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేసారు. పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యూవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం చెంది ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక నాయకులు వ్యవహరిస్తున్న తీరు మీద పార్టీ అగ్ర నాయకత్వానికి నేరుగా వస్తున్న ఫిర్యాదులను కూడా గమనంలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

నేతల వైఖరి భిన్నం :

జనసేన సిద్ధాంతాలకు విధానాలకు ఆకర్షితులై బలపరచామని కానీ జిల్లా పెద్దల తీరు దానికి భిన్నంగా ఉందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని పవన్ పేర్కొన్నారు. నాయకుల మధ్య విభేదాలు అలాగే క్రమ శిక్షణా రాహిత్యం వ్ల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అని కూడా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలను రద్దు చేస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు. ఇక జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న వారితో పాటు కమిటీలో ఇతర సభ్యులను కూడా బాధ్యతల నుంచి తప్పించడమైనది అంటూ పవన్ కీలక ప్రకటన చేశారు.

తక్షణం అమల్లోకి :

ఇక ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని కూడా పవన్ పేర్కొన్నారు. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేమని పవన్ చెప్పుకొచ్చారు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం అయింది అని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రకాశజ్ జిల్లా కమిటీని రద్దు చేసామని అదే తరహాలో నెల్లూరు జిల్లా కమిటీని కూడా రద్దు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఇక కొత్త కమిటీని నియమించేటంతవరకూ నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయమే చూస్తుందని ఆయన చెప్పడం విశేషం.

కొరడా ఝళిపిస్తున్నారు :

ఇదిలా ఉంటే పవన్ కొరడా ఝళిపిస్తున్నారు అని అంటున్నారు. పార్టీ పట్ల ఏ మాత్రం శ్రద్ధాసక్తులు లేని వారికి తామే సర్వస్వం అనుకుని పార్టీని ఎదగనీయని వారిని దూరం పెట్టాలని నిర్ణయించారని అంటున్నారు. జనసేనలో కాయకర్తలను పట్టించుకోని వారికి కూడా ఇదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పడానికి ఏకంగా రెండు ఉమ్మడి జిల్లాల కమిటీలను పవన్ రద్దు చేసి చూపించారు. మరి మిగిలిన ఉమ్మడి పదకొండు జిల్లాల కమిటీలు ఈ పరిణామం చూసి ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే కనుక వాటిని సైతం రద్దు చేసేందుకు అధినాయకత్వం వెనకాడదు అని చెప్పడానికే పవన్ ఈ కఠిన నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. జనసేనలో పనిచేసే వారికే స్థానం అన్నది పవన్ నినాదం కాదని అది విధానంగా మారబోతోంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా చెబుతున్నారు.

Tags:    

Similar News