అర్థరాత్రి ఒంటరిగా పబ్ కు.. స్పై కెమెరాతో మహిళా డీసీపీ రితిరాజ్ ఆపరేషన్

అర్థరాత్రి వేళ.. ఒంటరిగా స్పై కెమెరాతో పబ్ కు వెళ్లిన ఆమె.. అక్కడ చూసిన గలీజు పనులకు అడ్డుకట్ట వేశారు.

Update: 2026-06-08 04:22 GMT

కొద్దిరోజుల క్రితం మల్కాజిగిరి సీపీ సుమతి చేసిన సీక్రెట్ ఆపరేషణ్ ఎంతటి సంచలనానికి కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్థరాత్రి వేళ.. ఒంటరిగా ఆమె దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద ఉండటం.. ఆ సందర్భంగా పోకిరీలు వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేయటం.. ఇంత జరుగుతున్నా గస్తీ పోలీసుల జాడ లేకుండా పోవటం లాంటి అంశాలు వెలుగు చూశాయి. ఈ రహస్య ఆపరేషన్ ద్వారా పోలీసులు గస్తీతో పాటు.. అర్థరాత్రి వేళ అసలేం జరుగుతుందన్న విషయాలు అందరికి తెలిసేలా చేశాయి. కట్ చేస్తే.. తాజాగా కూకట్ పల్లి డీసీపీగా వ్యవహరిస్తున్న రితిరాజ్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి.. పబ్ లో జరిగే గలీజ్ గబ్బు ఉదంతాలను వెలికి తీయటమేకాదు.. స్థానిక పోలీసులు నిర్లక్ష్యాన్ని గుర్తించారు.

అర్థరాత్రి వేళ.. ఒంటరిగా స్పై కెమెరాతో పబ్ కు వెళ్లిన ఆమె.. అక్కడ చూసిన గలీజు పనులకు అడ్డుకట్ట వేశారు. అనంతరం ఆమె ఆదేశాలతో పబ్ పై పోలీసులు మెరుపుదాడి చేయటమే కాదు.. మేనేజర్ ను అరెస్టు చేశారు. పోలీసులు అదుపులో నలుగురుయువతులతో సహా మొత్తం ఎనిమిది మందిని కస్టడీలోకి తీసుకున్న వైనం సంచలనంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే.. కూకట్ పల్లి డీసీపీ రిత్ రాజ్ స్పై కెమేరాలు ధరించి.. అర్థరాత్రి వేళ ఒక్కరే ఒంటరిగా మఫ్టీలో కేపీహెచ్ బీ పరిధిలోని ఒక పబ్ కు వెళ్లారు. తనతో పాటు సిబ్బందిని వెంట తీసుకెళ్లలేదు.

ఈ సందర్భంగా పబ్ లో జరుగుతున్న దారుణాల్ని గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించటానికి వివిధప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిల్ని అక్రమంగా రవాణా చేసి తీసుకురావటమే కాదు.. పబ్ లో అసభ్య.. అశ్లీలంగా డ్యాన్సులు.. అసాంఘిక కార్యక్రమాలు బట్టబయలు అయ్యేలా చేశారు. కస్టమర్లను ఆ యువతులు మత్తులో ముంచి.. ఖరీదైన మద్యాన్ని కొనిపించి వేలల్లో బిల్లులు అయ్యేలా చేయటమే కాదు.. అశ్లీల న్రత్యాలు.. ఆపై వ్యభిచారానికి సైతం సిద్ధమన్నట్లుగా కస్టమర్లను ఆకర్షిస్తున్న వైనాన్ని గుర్తించారు.

దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియో ఆధారాల్ని రికార్డు చేశారు. అనంతరం ప్రత్యేక పోలీసు టీంకు ఆదేశాలు జారీ చేయటం ద్వారా.. పబ్ మేనేజర్ ను అరెస్టు చేశారు. వీరితో పాటు నలుగురు యువతులు.. నలుగురు యవకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఉదంతానికి మూలం డీసీపీకి అందిన ఒక ఫిర్యాదుగా తెలుస్తోంది.

ఒక ఐటీ ఉద్యోగికి డేటింగ్ యాప్ లో ఒక యువతి పరిచయమైంది. కేపీహెచ్ బీలోని ఒక పబ్ లో కలుద్దామని చెప్పటంతో.. గత నెల 29న అతను అక్కడికి వెళ్లాడు. రెండు పెగ్గుల విస్కీ తాగగా.. ఆమె నాలుగు పెగ్గుల విస్కీ తాగింది. చివర్లో రూ.41వేలకు పైనే బిల్లు రావటంతో అతడికి షాక్ తగిలినట్లైంది. అంత మద్యాన్ని తాను తాగలేదని చెప్పినా.. పబ్ నిర్వాహకులు మాత్రం వినలేదు. తనతో ఉన్న యువతిని అడగాలని చెప్పిన ఆ యువకుడికి.. అప్పటికే ఆమె అక్కడ నుంచి వెళ్లిపోవటంతో తనను మోసం చేసినట్లుగా గుర్తించాడు.

దీంతో.. ఈ మోసంపై బాధితుడు కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇలాంటి దందాలు ఇటీవల కాలంలో ఎక్కువ కావటం.. పోలీస్ స్టేషన్ కు కూతవేటుతో జరుగుతున్న ఈ గలీజు విషయాలకు స్థానిక పోలీసులు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కూకట్ పల్లి డీసీపీ రిత్ రాజ్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ పబ్ లో జరిగే గలీజు వ్యవహారాలు బట్టబయలు అయ్యేలా చేశాయని చెప్పాలి. పబ్ నిర్వాహణపై డీసీపీ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. స్థానిక పోలీసులు తీరుపై రహస్య విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News