ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. మధ్యతరగతికి ముందస్తు సంక్రాంతి!
గృహ కొనుగోలు దారులకు.. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను మరో 0.25 శాతం చొప్పున తగ్గిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది.;
గృహ కొనుగోలు దారులకు.. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను మరో 0.25 శాతం చొప్పున తగ్గిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో వాహన, గృహ రంగానికి సానుకూల పరిణామాలు వుంటాయని పేర్కొన్నారు. తద్వారా మధ్య తరగతి ప్రజలకు ముందస్తు సంక్రాంతి వచ్చినట్టు అయింది.
అయితే.. వాస్తవానికి ప్రస్తుతం డాలర్‌తో మారకం విలువ తగ్గిపోతున్నప్పుడు.. ఇలా వడ్డీ రేటును తగ్గించడం.. నిజానికి ఎంతో ప్రయోజనమే!. అయితే... దీని వెనుక రీజన్‌లు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లను అదే పంథాలో కొనసాగితే.. తగ్గిన రూపాయి విలువ మరింత దిగజారే అవకాశం ఉంటుందని అంచనా. అదే విధంగా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించే ప్రమాదం కూడా ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆర్బీఐ వ్యూహాత్మకంగా ఈ తగ్గింపును ప్రకటిస్తుండడం గమనార్హం. నిజానికి ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ ఉన్నప్పుడు.. వడ్డీ రేట్లను నిరంతరం పెంచారు. ఇటీవలే కొంత ఉపశమనం ప్రక టిస్తూ వస్తున్నారు. అయితే.. దీనికి కూడా కొన్ని వ్యూహాత్మక కారణాలు ఉన్నాయన్నది పరిశీలకులు చెబు తున్న మాట. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లు.. కొంత మేరకు తగ్గుముఖం పట్టాయి. ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది.
ఇక, గత ఫిబ్రవరి, మార్చి, జూన్‌లోనూ ఆర్బీఐ తన రెపో రేటును రివ్యూ చేసింది. ఈ నేపథ్యంలోనే సుమా రు రూ.1 వరకు వడ్డీరేటును తగ్గించింది. దీంతో మధ్యతరగతి, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు దారులకు మేలు జరిగింది. ఇప్పుడు మరో 0.25 బేసిస్ పాయింట్లు(వాడుక భాషలో పావలా) తగ్గించడం ద్వారా మరింత ఊతం దక్కనుంది. ఉదాహరణకు 30 లక్షల ఇంటి లోన్ తీసుకున్న వారికి సుమారు 600 వరకు నెలకు కలిసి రానుంది.