జనాలకు గొప్ప గుడ్ న్యూస్.. బంగారంపైనే కాదు.. వెండిపైనా రుణాలు

బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండగా, ఇప్పుడు వెండి కూడా అదే లిస్టులో చేరింది. ఇప్పటివరకు బ్యాంకులు కేవలం బంగారం మీదనే రుణాలు ఇస్తూ వచ్చాయి.;

Update: 2025-10-26 04:57 GMT

బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండగా, ఇప్పుడు వెండి కూడా అదే లిస్టులో చేరింది. ఇప్పటివరకు బ్యాంకులు కేవలం బంగారం మీదనే రుణాలు ఇస్తూ వచ్చాయి. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వెండి పైన కూడా రుణాలు పొందే అవకాశం ఉండబోతోంది. ఇది సాధారణ ప్రజలకు, ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారస్తులకు గొప్ప ఉపశమనం.

బ్యాంకు రుణాలకు వెండి కూడా తాకట్టు

ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం, 2026 ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs), ఇతర ఫైనాన్స్ సంస్థలు వెండిని కూడా తాకట్టు తీసుకోవచ్చు. అంటే బంగారం లాగా వెండి నగలు లేదా నాణేలు ఇచ్చి రుణం పొందవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఇది ఒక కొత్త మైలురాయిగా నిలవనుంది.

* రైతులు, చిన్న కంపెనీలకు ఉపశమనం

ప్రస్తుతం వ్యవసాయం, చిన్న - మధ్యతరహా పరిశ్రమలు (MSME) రంగాల్లో రూ. 2 లక్షల వరకు కోలాటరల్ లేకుండా రుణాలు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు వారు స్వచ్ఛందంగా వెండి తాకట్టు పెట్టి రుణం పొందవచ్చు. బ్యాంకులు దీనిని బలవంతంగా చేయలేవు అని ఆర్బీఐ స్పష్టంచేసింది. గతంలో కోలాటరల్ లేని రుణ పరిమితి రూ. 1.6 లక్షలుగా ఉండగా, 2024 డిసెంబర్‌లో దాన్ని రూ. 2 లక్షలకు పెంచారు.

వెండిపై రుణ పరిమితులు (LTV రేషియో)ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం వెండి విలువ ఆధారంగా రుణ పరిమితులు ఇలా ఉంటాయి

రుణ మొత్తంగరిష్ట రుణ పరిమితి (LTV రేషియో)

రూ. 2.5 లక్షల లోపు - 85% వరకు

రూ. 2.5 – 5 లక్షల మధ్య- 80% వరకు

రూ. 5 లక్షలకు మించి - 75% వరకు

ఒక వ్యక్తి గరిష్టంగా 10 కిలోల వెండి నగలు లేదా 500 గ్రాముల నాణేలు తాకట్టు పెట్టవచ్చు.

*బులియన్‌పై రుణం లేదు – కేవలం నగలు/నాణేలు మాత్రమే

వెండి బార్లు, ఈటీఎఫ్‌లు , లేదా మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలు ఇవ్వరని ఆర్బీఐ స్పష్టంచేసింది. కేవలం వెండి నగలు, నాణేలు మాత్రమే తాకట్టు ఇవ్వవచ్చు. టియర్ 3 & 4 అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు కూడా ఈ రుణాలను అందించవచ్చు.

* నిల్వ, వేలం, పారదర్శకతపై కఠిన నియమాలు

ఈ కొత్త రుణాలకు సంబంధించి ఆర్బీఐ కఠిన నియమాలను రూపొందించింది. వెండి తనిఖీ సమయంలో రుణగ్రాహకుడు తప్పనిసరిగా హాజరై ఉండాలి. వెండి బరువు, విలువను ఖచ్చితంగా రికార్డు చేయాలి. రుణం చెల్లించకపోతే వేలం విధానం ముందుగానే ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనాలి. వెండి నష్టం జరిగితే రుణ సంస్థ తప్పనిసరిగా పరిహారం ఇవ్వాలి.

* వెండి ధరల పెరుగుదల మధ్య కీలక సంస్కరణ

2025లో వెండి ధరలు భారీగా పెరుగుతుండటంతో, RBI ఈ నిర్ణయం తీసుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది రుణ విధానంలో పారదర్శకతను పెంచి, చిన్న వ్యాపారాలు మరియు రైతులకు తక్కువ వడ్డీకే నిధులను సమకూర్చుకోవడానికి సహాయకారిగా ఉంటుంది.

ఈ కొత్త వ్యవస్థ 2026 ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది. బంగారం పైన లాగే వెండి పైన కూడా రుణాలు ఇవ్వడం వల్ల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు లభించనుంది.

Tags:    

Similar News