కరువు సీమ కాదు.. మరో కోనసీమ.. రాయలసీమపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
రాష్ట్రంలోని అమలు చేస్తున్న ఆధునిక సాగు పద్ధతుల వల్ల రాయలసీమలో స్పష్టమైన మార్పు వచ్చిందని చంద్రబాబు చెప్పారు.;
కరువు ప్రాంతంగా దశాబ్దాలుగా కునారిల్లిన రాయలసీమ ప్రాంతం పచ్చని కోనసీమను అధిగమించిన విధంగా ఉద్యాన పంటలతో విరాజిల్లుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపు వంటి చర్యల వల్ల రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో పండ్ల తోటలు సాగు పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తలసరి ఆదాయంలో రాయలసీమ జిల్లాలు కోనసీమ ప్రాంతాన్ని అధిగమించాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ల సమావేశంలో రాయలసీమలో పండ్ల తోటల ద్వారా సాధించిన విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
రాష్ట్రంలోని అమలు చేస్తున్న ఆధునిక సాగు పద్ధతుల వల్ల రాయలసీమలో స్పష్టమైన మార్పు వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ప్రధాన నీటి ప్రాజెక్టుల నుంచి రాయలసీమకు నీటి తరలించామని, దీనివల్ల సత్ఫలితాలు వచ్చాయని సీఎం వివరించారు. బిందు, తుంపర సేద్యం వంటి ఆధునిక పద్ధతులను వాడటం ద్వారా రాయలసీమ రైతులు పెద్ద ఎత్తున ఉద్యాన పంటల సాగువైపు ద్రుష్టి పెట్టారని సీఎం వెల్లడించారు. గతంలో ఎక్కువగా వేరుశనగ వంటి పంటలను సాగు చేసి నష్టపోయిన రైతులు ఇప్పుడు టమాటా, చినీ, ఉల్లి, మామిడి పంటలు పండిస్తూ ఆర్థికంగా లాభపడుతున్నారని చంద్రబాబు తెలిపారు.
ఆధునిక నీటి నిర్వహణ పద్ధతుల వల్ల రాయలసీమ రైతులు గణనీయ ఫలితాలిచ్చాయని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా డెల్టాలోని క్రిష్ణా నీటిని ఆదా చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు సాగునీటిని మళ్లించామని చంద్రబాబు గుర్తు చేశారు. అదేవిధంగా హంద్రీ - నీవా కాలువల ద్వారా క్రిష్ణా జలాలను కుప్పం వరకు సరఫరా చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో ముఖ్యంగా వాణిజ్య పంటలకు సంబంధించిన రైతులు సకాలంలో తీసుకున్న నిర్ణయాలు మెరుగైన ఫలితాలు సాధించడంలో కీలకపాత్రను పోషించాయని సీఎం వెల్లడించారు.
రైతులు ఆర్థికంగా లాభపడేలా కలెక్టర్లు వ్యవహరించాలని, సరైన పంటలను ఎంచుకోవడం, సకాలంలో వారికి మద్దతుగా నిలిచి రైతులను ఆదుకునేలా కలెక్టర్లు నడుచుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నీటిని సరఫరా చేయడమే కాకుండా ఒకప్పుడు వర్షంపై ఆధారపడిన ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని మరింత స్థిరమైన లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నిరంతరం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాళ్ల సీమ అనే ఇమేజ్ ను తొలగించుకుని రాయలసీమ రతనాల సీమగా మారిందని, ఇప్పుడు ఎక్కడ చూసినా కోనసీమలో కనిపించినట్లు పచ్చదనం పరుచుకుందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.