దేశవ్యాప్తంగా 'రాయచోటి' కలకలం.. ఏం జరిగింది?
ఈ ముఠాకు చెందిన అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా అలెర్టు అయ్యారు.;
ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి.. నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఇదేమీ రాజకీయ కలహాలతోనో.. హత్యలతోనో కాదు.. ఫ్యాక్షన్ ప్రాబల్యం ఉన్న సీమలో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాల్లో రాయచోటి ఒకటి. ఇక్కడ రాజకీయంగా కూడా పెద్దగా సమరాలు.. సాహసాలు ఉండవు. ప్రజలు కూడా ప్రశాంతంగానే ఉంటారు. అలాంటిది ఒక్కసారిగాఈ నియోజకవర్గం దేశవ్యాప్తంగాకలకలం సృష్టించడానికి కారణమేంటి? ఎందుకు? జాతీయస్థాయిలో అధికారులు ఇక్కడకు వచ్చి పరిశీలన చేయడం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
రాయచోటి నియోజకవర్గం ఇప్పుడు ఉగ్రవాదులకు స్థావరంగా మారిందన్న వార్తే.. పెను కలకలం సృష్టి స్తోంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. సాక్షాత్తూ.. ఉన్నతాధికారి, పోలీసు డీఐజీ ప్రవీణ్ చెప్పుకొచ్చారు. రాయచోటిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడమేకాదు.. ఇక్కడ బాంబులు కూడా తయారు చేసినట్టు పేర్కొన్నారు. అయితే.. గుట్టు చప్పుడు కాకుండా.. చేసిన ఈ వ్యవహారం రాత్రికి రాత్రి జరిగింది కాదని కూడా చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ముందే.. `అల్ ఉమా` ఉగ్రవాద ముఠా రాయచోటిలో అడుగు పెట్టినట్టు పేర్కొన్నారు.
ఈ ముఠాకు చెందిన అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా అలెర్టు అయ్యారు. పాత చీరలు అమ్ముకుంటూ.. ఎవరికీ అనుమానం రాకుండా.. వీరు ఇక్కడ సంచరిస్తున్నారని గుర్తించారు. అంతేకాదు.. ఉగ్రవాదులకు శిక్షణ కూడా ఇస్తున్నారని తెలుసుకున్నారు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేసే సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చగామారింది. రాయచోటి నియోజకవర్గం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ‘అల్ ఉమా’ పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు చేయడమే లక్ష్యంగా ఇక్కడ ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటయ్యాయి. ఓ కేసులో ఉప్పందున్న తమిళనాడు పోలీసులు.. రాయచోటిలో రహస్యంగా విచారణ చేశారు.
ఈ క్రమంలోనే ఇక్కడ ఉగ్రవాద వ్యవహారం తెరమీదికి వచ్చింది. గత నెలలోనూ.. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోనూ ఉగ్రవాది ఏజెంటును ఒకరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇతనికి హైదరాబాద్‌లో సన్నిహితుడిగా మెలిగిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. తాజా పరిణామంతో జాతీయ దర్యాప్తు(ఎన్ ఐఏ) అధికారులు కడప చేరుకున్నారు.