రాప్తాడా-ధర్మవరమా? డోలాయమానంలో పరిటాల ఫ్యామిలీ.. !
ఇక, వచ్చే ఎన్నికల నాటికి సునీత దాదాపు తప్పుకొంటున్నారు. సునీత ఇటీవల కాలంలో సిక్ అయ్యారు.;
పరిటాల ఫ్యామిలీ అనగానే అనంతపురం జిల్లా రాజకీయాలు గుర్తుకు వస్తాయి. పరిటాల రవి మరణానం తరం.. ఆయన ఫ్యామిలీ నుంచి సునీత రంగ ప్రవేశం చేశారు. 2014లో విజయం దక్కించుకుని మంత్రిగా కూడా చక్రం తిప్పారు. ఇక, 2019కి వచ్చేసరికి.. వారసుడు.. శ్రీరాంను రంగంలోకి దింపారు. అయితే.. ఆయన సక్సెస్ కాలేక పోయారు. అయితే.. ఇది వ్యక్తిగత పరాజయమని చెప్పలేం. ఎందుకంటే.. ఆ ఎన్నికల్లో వైసీపీ హవా రాష్ట్రాన్ని కుదిపేసింది.
సో.. ఈ నేపథ్యంలోనే అనేక మంది అతిరథులు అనే వారు కూడా పరాజయం పాలయ్యారు. ఇక, 2024 ఎన్నికలకు వచ్చేసరికి రాప్తాడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. కానీ, శ్రీరాం మాత్రం పట్టుబట్టి తనకు ధర్మవరం టికెట్ కావాలని కోరారు. చివరి నిముషం వరకు ఊగిసలాడారు. కానీ, కూటమి లో భాగంగా ఈ టికెట్‌ను బీజేపీకి ఇచ్చేసిన చంద్రబాబు.. రాప్తాడును మాత్రం రవి కుటుంబానికే ఇచ్చారు. దీంతో సునీత విజయం దక్కించుకున్నారు.
ఇక, వచ్చే ఎన్నికల నాటికి సునీత దాదాపు తప్పుకొంటున్నారు. సునీత ఇటీవల కాలంలో సిక్ అయ్యారు. అంతేకాదు.. ప్రజల మధ్య కూడా ఉండేందుకు.. ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకుమారుడు శ్రీరాంకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో సహజంగానే రాప్తాడును శ్రీరాంకు ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ.. శ్రీరాం మాత్రం తన తండ్రి గతంలో విజయం దక్కించుకున్న ధర్మవరంవైపే మరోసారి మొగ్గు చూపుతున్నారు.
ఇదే ఇప్పుడు పరిటాల కుటుంబంలో చర్చనీయాంశంగా మారింది. రాప్తాడులో రాజకీయం చేయాలని ఇటు సునీత, అటు పార్టీ కూడా చెబుతున్నా.. శ్రీరాం మాత్రం తరచుగా ధర్మవరంలో పర్యటిస్తున్నారు. ఇక్కడి టీడీపీ శ్రేణులతోనే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే.. ఇది సరైన విధానం కాదని.. పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం అయ్యేందుకు రాప్తాడు సరైన నియోజకవర్గం అని సూచిస్తున్నారు. మరి శ్రీరాం ఏం చేస్తారో చూడాలి.