లోకేష్ టీంలో ఆయనే మెయిన్ !
ఉత్తరాంధ్రాలో మంత్రి నారా లోకేష్ టీం లో అత్యంత సన్నిహిత నేతగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరే గట్టిగా వినిపిస్తోంది.;
ఉత్తరాంధ్రాలో మంత్రి నారా లోకేష్ టీం లో అత్యంత సన్నిహిత నేతగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరే గట్టిగా వినిపిస్తోంది. రామ్మోహన్ పొలిటికల్ ట్రాక్ రికార్డు తో పాటు ఆయన నిబద్ధత విధేయత, పార్టీ పట్ల ఆయన కుటుంబం చూపించిన చిత్తశుద్ధి ఇవ్వన్నీ క్రెడిట్ కిందకు వస్తున్నాయి. దివంగత ఎర్రన్నాయుడు చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ వచ్చారు. 1983లో యువ న్యాయవాదిగా ఉంటూ తొలిసారి టీడీపీ తరఫున హరిశ్చంద్రాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు గెలిచారు. ఆయన టీడీపీలో చంద్రబాబుకు ఎంతో దగ్గరగా ఉంటూ వచ్చారు ఉత్తరాంధ్రలో ఆయన కీలకంగా మారారు అందుకే కేంద్ర మంత్రిగా ఆయనకే బాబు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చారని చెబుతారు.
హ్యాట్రిక్ ఎంపీగా :
ఇక తండ్రి అడుగు జాడలలో రామ్మోహన్ నాయుడు నడుస్తూ వస్తున్నారు ఆయన 2014, 2019, 2024 లలో వరసగా శ్రీకాకుళం నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు, హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉంది. కలుపుగోలు తనం ఉంది. డైనమిక్ లీడర్ గా పేరు ఉంది. అందుకే నారా లోకేష్ టీం లో ఆయన కీలకంగా ఉన్నారని చెబుతున్నారు. ఒక విధంగా ఎర్రన్నాయుడు మాదిరిగా ఉత్తరాంధ్రాలో లోకేష్ టీం లో రామ్మోహన్ ముఖ్యమైన పాత్ర పోషించేవారుగా ఉంటున్నారు అని చెబుతున్నారు.
సెట్ చేసుకోవాల్సిందే :
ఇక చంద్రబాబుకు అప్పట్లో ప్రతీ జిల్లాలో దిగ్గజ నేతలు అండగా ఉంటూ వచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, దాడి వీరభద్రరావు, ఎంవీవీఎస్ మూర్తి ఇలా సీనియర్ నేతలు ఉంటే విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతిరాజు హవా నడిపేవారు. అలాగే కొండపల్లి పైడితల్లి నాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు వంటి వారు ఉండేవారు. శ్రీకాకుళం జిల్లాలో కిమిడి కళా వెంకటరావు, ప్రతిభాభారతి, గౌతు శ్యాం సుందర శివాజీ వంటి నేతలతో మూడు జిల్లాలలో టీడీపె పటిష్టంగా ఉండేది. ఇపుడు లోకేష్ టీం ని అలా సెట్ చేసుకోవాల్సిందే అని అంటున్నారు.
రాటు దేలాల్సిందే :
ఇక సీనియర్ నేత వారసులు అంతా ఇపుడు టీడీపీలో కొనసాగుతున్న రామ్మోహన్ నాయుడు స్థాయిలో వారు తమ సత్తాను ఇంకా చూపించడం లేకపోతున్నారు అని అంటున్నారు. జిల్లా స్థాయిలో ప్రముఖంగా ఎక్కడికక్కడ నాయకులు ఉంటే కనుక టీడీపీ మరో నలభై ఏళ్ళ పాటు ఉత్తరాంధ్రాలో తిరుగులేకుండా ఉంటుందని లోకేష్ నాయకత్వానికి కూడా మరింత బలోపేతం చేసేలా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ వారసులలో కొందరు ఇంకా టికెట్ దక్కించుకోలేదు, తెచ్చుకున్న వారిలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో కూడా ఇంకా దూకుడు చేయాల్సిన తీరు అయితే కనిపించడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే కాకపోయినా విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున కొంతవరకూ రాజకీయంగా రాణిస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో ఎవరికి సత్తా ఉండో వారిని మాత్రమే ఎంపిక చేసుకుని వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారని అంటున్నారు. టీడీపీకి తొలి తరం నేతల మాదిరిగా బలమైన నేతలు వారసులలో లేకపోతే మాత్రం కొత్త వారిని సైతం పార్టీ ప్రోత్సహించి ముందుకు సాగుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.