'బ్లాక్ బాక్స్' పై మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగినా.. అందుకు గల కారణాలు ఇప్పటికీ తెలియలేదనే సంగతి తెలిసిందే. అయితే దీనిపై పూర్తి దర్యాప్తు జరుగుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.;

Update: 2025-06-14 11:13 GMT
బ్లాక్ బాక్స్ పై మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమానం ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం దొరికిన బ్లాక్ బాక్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆ ఘోర విమాన ప్రమాదం నుంచి బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.

అవును... అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగినా.. అందుకు గల కారణాలు ఇప్పటికీ తెలియలేదనే సంగతి తెలిసిందే. అయితే దీనిపై పూర్తి దర్యాప్తు జరుగుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాల గురించి కీలకమైన సమాచారాన్ని బ్లాక్ బాక్స్ డేటా అందిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేస్తున్నామని.. పలు ఏజెన్సీలు, ఉన్నత స్థాయి ప్యానెల్స్ కలిసి ఈ ఘటనపై విస్తృత దర్యాప్తు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇదే సమయంలో... ఈ సంఘటనను మంత్రిత్వ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పిన రామ్మోహన్.. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) వెంటనే రంగంలోకి దిగిందని తెలిపారు.

ఇందులో భాగంగా... పరిస్థితిని సమీక్షించడానికి ఏఏఐబీ డీజీ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారని.. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రమాదం స్థలం నుంచి బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రధానంగా... బ్లాక్ బాక్స్ డీకోడింగ్ క్రాష్ ప్రక్రియలో.. లేదా, క్రాష్ ప్రక్రియకు కొన్ని క్షణాల ముందు ఏమి జరిగి ఉంటుందనే దానిపై లోతైన వివరణ ఇస్తుందని ఏఏఐబీ బృందం నమ్ముతుందని పేర్కొన్నరు.

ఈ క్రమంలో.. ఏఏఐబీ పూర్తి దర్యాప్తు అనంతరం ఇచ్చే నివేదిక కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. దేశంలో మనకు చాలా కఠినమైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని నొక్కి చెప్పారు. నిపుణుల విచారణ పూర్తైన తర్వాత తగిన సమయంలో మీడియాకు సమచారం ఇస్తామని అన్నారు. రెండు నెలల్లోగా విచారణ పూర్తవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు!

ఈ సందర్భంగా.. ఈ ప్రమాదంలో 274 మంది మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాల బాధను తాను అర్ధం చేసుకోగలని అన్నారు. తన తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారని.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకూ తెలుసని అన్నారు.

Tags:    

Similar News