కాంగ్రెస్ మార్క్ రాజకీయం.. రెండు రోజులకే కర్ణాటక మంత్రి రాజీనామా!

కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే సీనియర్ మంత్రి రామలింగారెడ్డి ఝలక్ ఇచ్చారు.

Update: 2026-06-05 09:17 GMT

కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే సీనియర్ మంత్రి రామలింగారెడ్డి ఝలక్ ఇచ్చారు. తాను ఆశించిన శాఖను కేటాయించలేదని కినుక వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కన్నడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం జరిగే వరకు అంతా సాఫీగా సాగిందని కాంగ్రెస్ ఊపిరి పీల్చుకున్న దశలో మంత్రి రామలింగారెడ్డి రూపంలో షాక్ తగలడం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.

ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ నెల 3న సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. అదేసమయంలో మరో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో రామలింగారెడ్డి కూడా ఉన్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న రామలింగారెడ్డి మంత్రివర్గ విస్తరణలో పదవితోపాటు బెంగళూరు నగరాభివృద్ధి శాఖను ఆశించినట్లు చెబుతున్నారు. అయితే గురువారం రాత్రి శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీనియర్ నేత రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖ అప్పగించారు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు.

2023లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేస్తున్నారు. కానీ, రెండుసార్లు ఆయన ఆశించిన శాఖ దక్కలేదని రామలింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు నచ్చిన శాఖను ఇవ్వనందుకు నిరసనగా పదవికి రాజీనామా చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలు గడవక ముందే ఆయన రాజీనామా పంపడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. రామలింగారెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని చెబుతున్నారు.

‘నా అంతరాత్మకు విరుద్ధంగా నేను పనిచేయలేను. పదే పదే నన్ను అవమానిస్తున్నారు. ఇక ఎంతకాలం భరించాలి? అందుకే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా.’ అంటూ మీడియా సమావేశంలో ప్రకటించారు రామలింగారెడ్డి. ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన రాజీనామా ప్రకటించిన వెంటనే అధిష్టానం దూతలు వచ్చి ఆయనను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ రామలింగారెడ్డి వెనక్కి తగ్గలేదు. తన రాజీనామా లేఖను వ్యక్తిగత కార్యదర్శి ద్వారా సీఎం కార్యాలయానికి పంపించారు. అయితే, తాను కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని.. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. "నేను గత 53 ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉన్నాను, ఇకముందు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతాను" అని తేల్చి చెప్పారు.

వేడెక్కిన కర్ణాటక రాజకీయం

డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక కేబినెట్‌లో సరికొత్త జోష్ వస్తుందని భావించిన హైకమాండ్‌కు ఈ పరిణామం తీవ్ర ఆందోళనకు గురిచేసిందని అంటున్నారు. 13 మంది మంత్రులకు శాఖలు కేటాయించిన కొన్ని గంటల్లోనే మొదటి వికెట్ పడటం డీకే శివకుమార్ ప్రభుత్వ ప్రతిష్టకు గట్టి దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, రామలింగారెడ్డి రాజీనామాపై సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘రామలింగారెడ్డి నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయనతో స్వయంగా మాట్లాడి సమస్యను త్వరలోనే సర్దుబాటు చేస్తాం" అని ప్రకటన చేశారు. శాఖల కేటాయింపులో సిద్ధరామయ్య వర్గానికి, డీకే వర్గానికి మధ్య జరుగుతున్న అంతర్గత పోరు వల్లే ఇలాంటి అసంతృప్తులు బయటపడుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News