అనపర్తి వ్యవహారంపై నల్లమిల్లి కీలక వ్యాఖ్యలు... డెడ్ లైన్ ఇదే!

ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రజల అభిప్రాయం మేరకు నాలుగు రోజుల్లో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు.

Update: 2024-03-28 09:41 GMT

బీజేపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తిలో తీవ్ర అలజడికి కారణమైన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా అప్పటికే కూటమిలో భాగంగా టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్థానంలో... బీజేపీ అభ్యర్థిని ప్రకటించారు. దీంతో... అనపర్తిలో తీవ్ర అలజడి నెలకొంది. తాజాగా ఈ విషయాలపై నల్లమిల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... అప్పటికే తనకు కేటాయించిన సీటులో తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా బీజేపీ అభ్యర్థికి కేటాయించడంపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో తన ఆవేదన వ్యక్తం చేశారు! తనకు కేటాయించిన సీటును బీజేపీకి ఇవ్వడం ఏమిటంటూ ఆయన ఆన్ లైన్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. తాను పార్టీకోసం ఎంతో కష్టపడ్డప్పటికీ తనకు టిక్కెట్ లేకుండా చేయడం ఏమిటంటూ ఆయన మనోవేదన చెందారు.

ఈ సందర్భంగా... "ఐదేళ్ళపాటు రాక్షసులతో ప్రత్యక్ష యుద్దం. 39 అక్రమ కేసులు, భౌతిక దాడులు, జైలు జీవితం, హత్యకు సుఫారీ, 400 మంది కార్యకర్తలపై 180కి పైగా కేసులు, లాఠీ దెబ్బలు, 24*7 ప్రజల కోసమే పోరాటం, కోట్ల రూపాయిల ఖర్చు ఇవేమీ కాపాడలేక పోయాయి. మాట మాత్రం కూడా చెప్పకుండా ఇచ్చిన టికెట్ ని లాగేసుకున్నారు" అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల నిరసనలకు సంబంధించి పలు వీడియోలను పోస్ట్ చేశారు.

Read more!

ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రజల అభిప్రాయం మేరకు నాలుగు రోజుల్లో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. వైసీపీ కుట్రవల్లే అనపర్తిలో బీజేపీకి టిక్కెట్ కేటాయించారని ఆరోపించారు. తనను తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేయాలని చూస్తున్నారని.. అయినా తన తుదిశ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని తెలిపారు. ఈ సమయంలో తన టిక్కెట్ విషయంలో ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని అన్నారు.

ఇదే సమయంలో... "ఐదేళ్ళపాటు నా ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టాను. నా కుటుంబాన్ని ఫణంగా పెట్టాను. ఆర్ధిక పరిస్దితిని ఫణంగా పెట్టాను. నాకు అన్యాయం జరిగింది. కుటుంబ సమేతంగా ప్రజల దగ్గరకే వెళ్ళి తేల్చుకుంటా. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా" అంటూ ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం అనపర్తిలో రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కుతుంది.. నల్లమిల్లి అనుచరులు తమ నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు.

Tags:    

Similar News