అనుకునంట్లే అనపర్తి టిక్కెట్ దక్కించుకున్న నల్లమిల్లి... వయా బీజేపీ!

ఇప్పుడు తాజాగా హార్డ్ కోర్ టీడీపీ నేత, ఆ పార్టీ వీరవిధేయుల్లో ఒకరు అయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్నారు.

Update: 2024-04-24 04:22 GMT

కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం అత్యంత ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పేరుకు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చినా, జనసేనకు 21 సీట్లు ఇచ్చినా.. అక్కడ చాలా స్థానాల్లో తిరిగి కండువాలు మార్చుకున్న టీడీపీ నేతలే చేరారని, ఇది సరికొత్త పసుపు కూటమి అని కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో... కూటమి అభ్యర్థులు చాలా ఫ్లెక్స్ బుల్ గా ఉంటున్నారు.. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నేతలు సర్ధుకుపోతుండటం మూడు పార్టీల ఐక్యతకు శుభపరిణామం అని మరికొందరు చెబుతున్నారు. ఈ సమయంలో అలాంటి ఐకమత్యం, సర్దుబాటు వ్యవహారం అనపర్తిలోనూ తెరపైకి వచ్చింది.

ఇప్పటివరకూ పలువురు టీడీపీ నేతలు జనసేన కండువా కప్పుకుని ఆయా స్థానాల్లో గాజు గ్లాసు టిక్కెట్లు సంపాదించుకోగా.. ఇప్పుడు తాజాగా హార్డ్ కోర్ టీడీపీ నేత, ఆ పార్టీ వీరవిధేయుల్లో ఒకరు అయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా... పురందేశ్వరి కాషాయ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

అవును... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. కాషాయ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమయంలో.. రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీచేస్తారని ఆమె తెలిపారు.

ఇదే క్రమంలో... అనపర్తిలోని బీజేపీ పార్టీ కార్యకర్తలతో టీడీపీ నుంచి వచ్చిన ఆయన అనుచరులు సమన్వయం చేసుకొని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని ఈ సందర్భంగా పురందేశ్వరి పేర్కొన్నారు. తొలుత అనపర్తి బీజేపీ టికెట్‌ దక్కించుకున్న శివరామకృష్ణంరాజు.. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, సీటు వదులుకొన్నారని పురందేశ్వరి ప్రశంసించారు.

Tags:    

Similar News