తమిళనాడులో స్టార్ వార్.. రజనీకాంత్ ను రంగంలోకి దింపిన బీజేపీ.. దళపతికి చెక్!
ద్రవిడ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్నా రాజకీయ వేడి మాత్రం చల్లారడం లేదు.
ద్రవిడ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్నా రాజకీయ వేడి మాత్రం చల్లారడం లేదు. ప్రధానంగా పార్టీ పెట్టిన 27 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన దళపతి విజయ్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. చేతిలో అధికారం కోల్పోయిన డీఎంకే ఒకవైపు కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా తమిళనాడు మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోవడంతో బీజేపీ మరోవైపు దళపతికి చెక్ చెప్పేలా కీలక అడుగులు వేస్తున్నాయని అంటున్నారు. ప్రధానంగా ఎలాగైనా తమిళనాడులో కాషాయ జెండా ఎగరవేయాలని ఆశిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం ద్రవిడ రాజకీయాల్లో సినీ గ్లామర్ కు ఉన్న క్రేజ్ ను వాడుకోవాలని భావిస్తోందని అంటున్నారు. ఇందుకు తాజాగా ఆ పార్టీ వేస్తున్న అడుగులను ఉదహరిస్తున్నారు.
తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ తో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ భేటీ కావడం రాజకీయా వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీతో బీజేపీ నాయకులు ఎందుకు భేటీ అయ్యారంటూ పరిశీలకులు ఆరా తీస్తున్నారు. గత కొన్నాళ్లుగా బీజేపీ పెద్దలతో రజనీకాంత్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు బీజేపీతో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరించిన సూపర్ స్టార్.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలోచన మార్చుకుని బీజేపీ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ కారణంతోనే బీజేపీ రాష్ట్ర నేతలు రజనీని ప్రత్యేకంగా కలిశారని అంటున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో బీజేపీకి అంతమాత్రంగానే బలం ఉంది. పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామా తర్వాత ఆ బలంపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నాయకుడు ఉంటేనే తమిళనాడులో తాము ఆశించిన స్థానానికి వెళ్లగలమని కేంద్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో రజనీకాంత్ ను మచ్చిక చేసుకుని రాజకీయాలపై ఆయన మనసు మార్చాలని బీజేపీ పెద్దలు వ్యూహం రచించారని అంటున్నారు. గతంలో సొంత పార్టీ పెట్టాలని భావించిన రజనీ అనూహ్యంగా ఒక్క రోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే తాజాగా దళపతి విజయ్ సాధించిన విజయం రజనీలో కొత్త ఆలోచనలు రేపుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సరిగ్గా బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ఇదే విధంగా ఆలోచిస్తోందని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు వచ్చిన తర్వాత తమిళ సినీ ఇండస్ట్రీలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో రజనీ రాజకీయ ప్రవేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉందని అంటున్నారు. దళపతి మాదిరిగా రజనీ కూడా రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేవారంటూ తలైవా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టే పరిస్థితి లేదని అంటున్నారు. దీంతో తమ అభిమాన నాయకుడిని ప్రభుత్వాధినేతగా చూడాలని ఆశ పడుతున్న అభిమానులు రజనీని ఏదైనా పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో బీజేపీ ఒక అడుగు ముందుకేసి రజనీతో టచ్ లోకి వెళ్లిందని అంటున్నారు. అయితే తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెబుతూ కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లలో సాధించిన విజయాలను వివరించేందుకు రజనీని కలిసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదే అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల అభివృద్ధిని వివరించడం వెనుక.. రాబోయే రోజుల్లో రజనీకాంత్ నుంచి నైతిక మద్దతు పొందే వ్యూహం ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.