ఇకపై మైసూర్ "పాక్" కాదు.. మైసూర్ "శ్రీ"!
గత కొన్ని రోజులుగా భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సరిహద్దుల్లో వాతావరణం వేడెక్కింది.;
ఆపరేషన్ పహల్గాం అనంతరం భారతీయులు అంతా పాకిస్థాన్ పై ప్రతీకారంతో రగిలిపోయిన సంగతి తెలిసిందే. ఇక 'ఆపరేషన్ సిందూర్' అనంతరం అంతా సంబరాలు చేసుకున్నారు! పాక్ కు సరైన బుద్ది చెప్పారని భావించారు. ఈ సమయంలో.. సోషల్ మీడియా వేదికగా పలు వంటకాలు, ఆకుల్లో "పాక్" అనే పదం ఉండటంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఓ స్వీట్ షాప్ యజమాని ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.
అవును... గత కొన్ని రోజులుగా భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సరిహద్దుల్లో వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో పాక్ పేరు చెబితేనే ఒంటిపై తేళ్లు, జెర్రెలు పాకుతున్నట్లు చాలా మంది భారతీయులు భావిస్తున్నారు. ఈ సమయంలో తన స్వీట్ షాపుల్లోని వంటకాల పేర్లలో ఉన్న "పాక్" ను తీసేశారు ఓ స్వీట్ షాప్ యజమాని.
ఇందులో భాగంగా... రాజస్థాన్ లోని జైపూర్ లో గల ప్రముఖ "త్యోహార్ స్వీట్స్" యజమాని ఈ మేరకు తమ దుకాణంలోని స్వీట్ల పేర్లలో మార్పులు చేశారు. ఇందులో భాగంగా... మైసూర్ 'పాక్' పేరును మైసూర్ 'శ్రీ' గా మార్చారు. ఇదే సమయంలో.. ఆమ్ పాక్, మోతీ పాక్, గోండ్ పాక్ పేర్లను కూడా... ఆమ్ శ్రీ, మోతీ శ్రీ, గోండ్ శ్రీ అని మార్చారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా స్పందించిన ఆ స్వీట్ షాపు యజమాని అంజలీ జైన్... దేశభక్తి కేవలం సరిహద్దుల్లోనే ఉంటే సరిపోదని.. ప్రతీ పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలని.. అందుకే ఈ నిర్ణయం అని అన్నారు. వాస్తవానికి "పాక్" అనే పదం సంస్కృతం నుంచి రాగా.. దానర్థం "పండటం" అని! అయితే.. పాక్ లో పాకిస్థాన్ పేరు ధ్వనిస్తుండటంతో ఈ పేరు మార్చినట్లు అంజలీ జైన్ తెలిపారు.
కాగా... గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పాక్ కు వ్యతిరేక క్యాంపెయిన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... మైసూర్ "పాక్", కరివే "పాక్", తమల "పాక్" ల పేర్లు.. మైసూర్ భారత్, కరివే భారత్, తమల భారత్ అని మార్చాలంటూ పలు పోస్టులు హల్ చల్ చేస్తోన్నాయి!