ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు దాటిన తర్వాత బోడ మల్లయ్య... మరోసారి సంచలన వ్యాఖ్యలు..
మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యాలు రోజు రోజుకు వైరల్ గా మారుతున్నాయి.;
మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యాలు రోజు రోజుకు వైరల్ గా మారుతున్నాయి. నిన్నటికి నిన్న ‘రాజగోపాల్ కు మంత్రి పదవి ఇస్తామన్న మాట వాస్తవం. కానీ రాజకీయ సమీకరణాలతో ఇవ్వలేకపోయాం’ అన్న భట్టి వ్యాఖ్యాలను ఎక్స్ లో పోస్ట్ చేసి రేవంత్ సర్కార్ ను విమర్శించిన రాజగోపాల్ రెడ్డి ఇప్పడు మరో అంశంను తలకెత్తుకున్నారు. తనకు మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే కాంగ్రెస్ లోకి వచ్చానని లేదంటే బీజేపీలోనే కొనసాగేవాడినని గతంలో చెప్పిన రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములు ఒక పార్టీలో ఉంటే ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వద్దని రాజ్యాంగంలో రాసుందా? అంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పలువురు నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని ప్రశ్నించారు. తను పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత హైకమాండ్ తిరిగి ఆహ్వానించిందన్నారు. తనకు మంత్రి పదవి హామీ ఇస్తేనే వచ్చినట్లు చెప్పిన ఆయన ఇప్పుడు తన సోదరుడు వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఉందని తనకు ఇవ్వకుండా ఉండడం సరికాదన్నారు. వెంకట్ రెడ్డి నేను అన్నదమ్ములమని అప్పుడు వారికి తెలియదా..? అని ప్రశ్నించారు. ఇద్దరు సమర్థవంతమైన నేతలని పెద్దలకు తెలిసిందే కదా అన్నారు. అలాంటప్పుడు ఇద్దరికి మంత్రి పదవి ఇస్తే ఏమవుతుందని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపు మూడేళ్లు కావస్తుందని అయినా తాను వేచి చూస్తానని మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు దాటిన తర్వాత బోడ మల్లయ్య.. లాగా హైకమాండ్ హామీ ఉందని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను తీసుకున్న హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా తనకు మంత్రి పదవిపై గట్టి హామీ ఇచ్చిందని తెలిపారు. కేవలం 9 నియోజకవర్గాలు ఉన్న ఖమ్మంకు ముగ్గురు మంత్రులను కేటాయించారు.. అలాంటిది 11 నియోజకవర్గాలు ఉన్న నల్గొండకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. గతంలో భువనగిరి ఎంపీగా చేశాను. నల్గొండకు ఎమ్మెల్సీ చేశాను. ఇప్పటికే మునుగోడు వెనుకబడి ఉంది. అభివృద్ది చేయాలంటే నిధులు కావాలని, అందుకే తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు చెప్పుకచ్చారు.
ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి లొల్లి ప్రభుత్వాన్ని రోజుకో చిక్కులో నెడుతోంది.