రాహుల్ కనెక్ట్ విత్ జెన్ జీ యూత్!

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు.

Update: 2026-06-14 16:39 GMT

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు. దేశంలో యువతను మరింత దగ్గర కావాలని ఆయన ఆలోచిస్తున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేయడం ద్వారా దేశంలో మెజారిటీ ఉన్న యువతను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అదే విధంగా జెన్ జీ తో కూడా కలసి ముందుకు అడుగులు వేయాలని చూస్తున్నారు. దీని కోసం కాంగ్రెస్ పార్టీ నయా వ్యూహాన్ని సిద్ధం చేసింది.

అసహనంగా యువత :

దేశంలో నిరుద్యోగ యువత అసహనంగా ఉంది అన్నది తెలిసిందే. కాక్రోచ్ పార్టీ పేరుతో ముకూ ముఖం తెలియని వారు నాయకత్వం వహించి సభలను పెడుతూంటే వెల్లువలా యూత్ అంతా అక్కడికి చేరుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశంలో అనేక పరీక్ష పత్రాలు లీక్ కావడం, జాతీయ విద్యా విధానం తీరు తెన్నుల మీద యువత మండిపోతూండడం, నిరుద్యోగం, కొత్తగా నోటిఫికేషన్లు లేకపోవడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ పరం చేయడం, పెట్టుబడుల ఉపసంహరణ ఇలా అనేక అంశాల మూలంగా సర్కారీ కొలువులు తగ్గిపోతున్నాయి. దాంతో పాటు ప్రశ్న పత్రాల లీకులు కూడా యూత్ ని ఆవేశపడేలా చేస్తోంది అని అంటున్నారు.

దేశవ్యాప్త పర్యటన :

ఈ క్రమంలో దేశ వ్యాప్త పర్యటనకు రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నారు. ఆయన ఈ నెల 17నుంచి పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీక్‌లు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాన్ని ప్రారంభించనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ప్రచారంలో భాగంగా పలు కీలక నగరాలలో యువత, ఆశావహులు, విద్యావేత్తలను లక్ష్యంగా చేసుకుని వరుసగా భారీ సదస్సులు, కీలక సమావేశాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని చెబుతున్నారు. దీనిని సంబంధించిన ప్రచార షెడ్యూలుని కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. దాని ప్రకారం చూస్తే రాహుల్ గాంధీ రాజస్థాన్ రాష్ట్రంలోని కోటకి వెళ్తారు. అక్కడ యువజన సమ్మేళనంలో పాలు పంచుకుంటారు. ఆ తరువాత జూలై 10 న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో స్టూడెంట్ మీట్, బీహార్ లోని పాట్నాలో జూలై 12న విద్యార్థుల సదస్సు, 14న ఢిల్లీలో యూత్ సమ్మిట్ నిర్వహిస్తారు అని చెబుతున్నారు.

ఇంటరాక్ట్ కావాలనే :

విద్యార్ధి లోకంతో పాటు యువతతో నేరుగా ఇంటరాక్ట్ కావాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు అని అంటున్నారు. వారి నుంచి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకోవడం, వారి ఆవేదనను వినడం, వారికి సంఘీభావంగా ఉండడం, కాంగ్రెస్ తరఫున భరోసా ఇవ్వడం రాహుల్ గాంధీ పర్యటన ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. ఈ రోజున దేశంలో యువత ఆగ్రహంగా ఉంది కాబట్టి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక విపక్ష పాత్రను పోషించడం ద్వారా వారిలో నైతిక స్థైర్యాన్ని నింపే కార్యక్రమం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.మరి రాహుల్ గాంధీ యూత్ తో జెన్ జీ తో కనెక్ట్ అవ్వాలన్న ఈ నయా వ్యూహం ఏ రకమైన ఫలితాలను పార్టీని అందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News