రాహుల్ ఓటు చోరీ ఉద్యమం...వైసీపీ అందుకే దూరం ?

రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు చోరీ అంటూ చాలా కాలంగా ఉద్యమిస్తూ వస్తున్నారు. ఓటు చోరీ బీహార్ లో జరిగింది.

Update: 2026-10-12 03:28 GMT

రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు చోరీ అంటూ చాలా కాలంగా ఉద్యమిస్తూ వస్తున్నారు. ఓటు చోరీ బీహార్ లో జరిగింది. హర్యానా, పశ్చిమ బెంగాల్ ఇలా అన్ని పేర్లూ చెబుతున్నారు కానీ ఏపీ విషయం ప్రస్తావించడం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో అర్ధ రాత్రి ఏకంగా 12 లక్షలకు పైగా ఓట్లు ఒకే మొత్తంగా పోల్ అయ్యాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరి ఇంత పెద్ద అంశం కాంగ్రెస్ కి రాహుల్ కి కనిపించలేదా అన్నదే వైసీపీ వర్గాలలో నెలకొన్న ఆవేదనగా ఉంది అంటున్నారు.

ఏపీని పక్కన పెడుతూ :

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎన్నికల అక్రమాలు జరిగాయని బిగ్గరగానే గొంతు పెంచుతున్నారు. అంతే కాదు ఓట్ల చోరీ జరిగింది అని ఈ అంశం మీద ఏకంగా దేశవ్యాప్తంగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఇపుడు దానిని మరింతగా ఉధృతం చేశారు. అంతే కాదు కాంగ్రెస్ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. మిగిలిన సమస్యలు అన్నీ ఒక ఎత్తు, ఈ ఇష్యూ మరో ఎత్తు అన్నట్లుగానే భారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. అయితే ఎంతసేపూ ఉత్తర భారతాన పలు రాష్ట్రాలలో ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. కానీ దక్షిణాదిన మాత్రం ఏమీ జరగలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. మిగిలిన రాష్ట్రాలలో ఎక్కడా ఎన్డీయే లేదు, ఏపీలో మాత్రం 2024 లో గెలిచింది. మరి ఏపీలో ఎన్నికల అక్రమాలు జరిగాయని వైసీపీ అంటోంది. దీని మీద ఎందుకు కాంగ్రెస్ మాట్లాడదు అన్నదే వైసీపీ శిబిరం నుంచి వినిపిస్తున్న మాట అంటున్నారు.

ఆ ఊసే లేకుండానే :

ఇక చూస్తే కనుక ఏపీ ఎన్నికల అంశాన్ని ఏ రోజూ కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ కానీ నేరుగా ప్రస్తావించలేదన్నది వైసీపీ శిబిరం నుంచి జరుగుతున్న చర్చగా ఉంది. ఇక తాజాగా ఇదే నెలలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రతినిధులు ఓటర్ల జాబితా సవరణ సర్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, బీహార్ వంటి రాష్ట్రాలలో జరిగిన ఓట్ల తొలగింపు అక్రమాలపైనే దృష్టి పెట్టారని గుర్తు చేస్తున్నారు. మరి ఏపీ సంగతి ఏమిటి అన్నదే వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్నగా ఉంది.

గ్యాప్ అక్కడే మరి :

దీంతోనే ఏపీలో వైసీపీకి కాంగ్రెస్ కి మధ్య గ్యాప్ అయితే ఉంది అని అంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏపీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించకపోవడంపై గతంలో వైసీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నికలలో ఓట్లలో తేడాలు జరిగాయని, అలాగే అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ ఈ అంశం కాంగ్రెస్ కి ఎందుకు గుర్తు రావడం లేదని కూడా ప్రశ్నిస్తోంది. ఏపీలో ఉన్న అధికార పార్టీ పెద్దలతో కాంగ్రెస్ హైకమాండ్‌కు ఉన్న హాట్‌లైన్ అంటే సన్నిహిత సంబంధాల వల్లే ఏపీలో జరిగిన అక్రమాలపై రాహుల్ గాంధీ నోరు మెదపడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇండీ కూటమి ఓట్ల చోరీ మీద ఉద్యమాలు చేస్తున్నా వైసీపీ మాత్రం దూరంగా ఉంటోంది అని అంటున్నారు. మరి రానున్న రోజులలో ఈ విషయంలో ఇండీ కూటమి ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దానిని బట్టే పరిణామాలు మారే చాన్స్ ఉందని అంటున్నారు.

Tags:    

Similar News