జెన్ జీ తో మోడీ అండ్ రాహుల్...మా మాట వినండి !
జెన్ జీ ఇపుడు దేశ రాజకీయాల్లో కీలకమైన ఫ్యాక్టర్ గా మారుతోంది. జెన్ జీ యూత్ ఏమైనా చేయగలరు అన్నది కూడా అందరికీ అర్థం అవుతోంది.
జెన్ జీ ఇపుడు దేశ రాజకీయాల్లో కీలకమైన ఫ్యాక్టర్ గా మారుతోంది. జెన్ జీ యూత్ ఏమైనా చేయగలరు అన్నది కూడా అందరికీ అర్థం అవుతోంది. వారు తలచుకుంటే రాత్రికి రాత్రి ఉద్యమాలు పుట్టించగలరు, ఎందాకైనా అని దూసుకుని పోగలరు, వారిని సునామీగా అభివర్ణించవచ్చేమో. అలాగే వారు దూకుడుకు హద్దే లేదు అని అంటారు. ఇక రేపటి ఎన్నికల్లో వారి ప్రభావం అపారం. అందుకే దేశ రాజకీయాలు మొత్తం జెన్ జీ చుట్టే తిరుగుతున్నాయి. ఇక చూస్తే జెన్ జీతో తరచూ ఇంటరాక్ట్ అవుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. చిత్రమేంటి అంటే చెన్నై వేదికగా కేవలం ఒక్క రోజు తేడాలో రాహుల్ మోడీ ఇద్దరూ జెన్ జీతో మీటింగులు పెట్టడం.
యువత సత్తా అది :
ఈ దేశాన్ని ప్రపంచాన్నే మార్చగల సత్తా యువతకు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఆయన చెన్నైలోని నందంబాక్కంలో చెన్నై ట్రేడ్ సెంటర్‌లో జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశమే కాదు ప్రపంచం ఈ రోజున ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం యువత సొంతం అన్నారు. యువత తమ భవిష్యత్తు కోసం విశాలంగా ఆలోచించాలని మోడీ ఉద్భోదించారు. పెద్ద కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మోడీ పిలుపు ఇచ్చారు.
భారత్ వికాసం కోసం :
అభివృద్ధి చెందిన భారతం కోసం యువత అవసరమైన కొత్త ఆలోచనలు సూచనలు, అలాగే పరిష్కారాలు అందించాలని మోడీ కోరారు. ఈ రోజున భారత్‌లో యువతకు ఉన్నన్ని అవకాశాలు ఎక్కడా లేవని ఆయన చెప్పారు. యువత తాము అనుకున్నది చేయాలని, అదే సమయంలో నిర్మాణాత్మక పంధాను వీడరాదని మోడీ చెప్పారు. ఎలాంటి యువత భయం లేకుండా ముందుకు సాగాలని మోడీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో సర్ కి వ్యతిరేకంగా జెన్ జీలు సీజేపీ నాయకత్వంలో ఉద్యమిస్తున్నారు. అదే సమయంలో యువత శక్తిని నరేంద్ర మోడీ గుర్తు చేస్తూనే దేశాభివృద్ధికి పాటు పడాలని సూచించడం విశేషం.
రాహుల్ స్పీచ్ అయితే :
మరో వైపు చెన్నైలో ఐలాండ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఛాత్రోన్ కీ గూంజ్ ఆరవ ఎడిషన్ కార్యక్రమాన్ని రాహుల్ యువతతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపు ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ రాజ్యాంగంపై దాడి చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దేశ ప్రజల గళాన్ని వినిపించడానికి యువత తమ నిరసనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదని ఆయన కోరారు. యువత నిరంతరాయంగా పోరాడుతూనే ఉండాలని ఆయన కోరారు. అదే సమయంలో రాజ్యాంగంపై దాడికి దిగుతున్న శక్తులను తాము ఖచ్చితంగా ఓడిస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
యువత సమస్యల గురించి :
ఇదిలా ఉంటే ఈ సదస్సులో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అలాగే తమిళనాడు విద్యార్థులు ఎదుర్కొంటున్న నీట్ పరీక్ష సమస్యలు పేపర్ లీకేజీలు, దేశంలో తీవ్రమైన నిరుద్యోగం, విద్యా రంగంలో ఎదురవుతున్న ఆర్థిక భారాలు మహిళా విద్య వంటి అంశాలపై విద్యార్థులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. ప్రతీ విషయాన్ని ప్రశ్నించడం కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండటమే నిజమైన విద్యార్థి యొక్క అసలైన లక్షణమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువతకు తాము అంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇవనీ పక్కన పెడితే ఒక్క రోజు తేడాలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఇద్దరూ యువతకు ఉద్బోధ చేశారు. మా మాటే వినాలని కోరారు. ఇంతకీ జెన్ జీ ఎవరి మాట వింటుంది అన్నదే చూడాలి మరి.