అందరి కంటే ముందే పవన్ మొదలెట్టేశారు !
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. నేడో రేపో అని అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. నేడో రేపో అని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇంకా పూర్వ రంగం సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని అందరి కంటే ముందే మొదలెట్టేశారు. ఆయన రంపచోడవరం నియోజకవర్గం కకవాడ గ్రామ సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ప్రజలకు నేరుగా కోరడం ద్వరా ప్రచారాన్ని ప్రారంభించారు.
ప్రజలు అండగా :
స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని అందువల్ల కూటమి అభ్యర్ధులకు అండగా ప్రజలు నిలవాలని పవన్ కోరారు. అంతే కాదు కూటమిలోని అన్ని పార్టీల నాయకులు పరస్పరం కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. కూటమి విజయం అందరి లక్ష్యం కావాలని కోరారు. ఇక జనసేన పొత్తుల గురించి ఆయన ప్రస్తావించారు. కూటమి గెలుపు కోసం 2024 లో జనసైనికులు ఎన్నో త్యాగాలు చేశారు అని ఆయన గుర్తు చేశారు. ఈసారి అలాంటి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు దక్కాల్సిన అవసరాన్ని పవన్ నొక్కి చెప్పడం విశేషం.
రాజకీయాలకు అతీతంగా :
తమ ప్రభుత్వంలో రాజకీయలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ నేతలు ప్రాతినిధ్యం వహించిన చోట కూడా పంచాయతీ రాజ్ నిధులను అందించామని పవన్ గుర్తు చేశారు. అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి అన్నదే కూటమి ప్రభుత్వం విధానం అని పవన్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఏ పార్టీకి ఓటు చేశారని చూడకుండా అరకు పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. అరకు ఎంపీగా వైసీపీని గెలిపించారని ఆయన చెప్పుకొచ్చారు. అయినా అభివృద్ధి ఆగదని పవన్ చెప్పడం వెనక జనం మద్దతు కూటమికి దక్కాలన్న ఆలోచన ఉందని అంటున్నారు.
పార్టీ రంగుల కోసం :
వైసీపీ ప్రభుత్వం వందల కోట్లు పార్టీ రంగులను భవనాలకు వేయడానికి ఖర్చు పెట్టిందని పవన్ విమర్శించారు. ఆ నిధులు కనుక సక్రమంగా వెచ్చించి ఉంటే ఎన్నో గిరిజన గ్రామాలకు రహదారులు వచ్చి ఉండేవని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు ఆ విధంగా మెరుగు పడేది అని పవన్ చెప్పారు. కానీ వైసీపీ తీరు వేరుగా ఉండడం వల్ల పల్లెలు గిరిజన ప్రాంతాలు ఎంతగానో నష్టపోయాయని పవన్ నిందించారు. తమకు రాజకీయాల కంటే వ్యవస్థ బాగుండాలి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రోడ్ల నాణ్యతను వారు పరిశీలించి సక్రమంగా వేస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేయాలని పవన్ కోరారు.
గిరిజనంతో మమేకం :
మొత్తం మీద చూస్తే పవన్ గిరి జనంతో మమేకం అయ్యారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఎక్కువగా గిరిజన ప్రాంతాల మీదనే ఫోకస్ పెడుతున్నారు. తనకు గిరిజనులు అంటే ఇష్టమని తాజా సభలో పవన్ చెప్పడం విశేషం. గిరిజనం కోసం వారి అభ్యున్నతి కోసం తాను పనిచేస్తాను అని పవన్ అన్నారు. మొత్తానికి పవన్ చూపిస్తున్న ఈ నిబద్ధత గిరిజన ప్రాంతాలలో రాజకీయ పరిణామాలను కూడా మారుస్తుందా అన్న చర్చ సాగుతోంది.