విజయ్ నిన్న రాహుల్ తో... నేడు మోడీతో !
తమిళనాడు సీఎం గా అయిదు నెలల అనుభవం ఉన్న విజయ్ ఇపుడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు అనే చెప్పాలి.
తమిళనాడు సీఎం గా అయిదు నెలల అనుభవం ఉన్న విజయ్ ఇపుడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు అనే చెప్పాలి. ఆయనతో స్నేహం చేయాలని తెలుగు రాజకీయ నేతలు కూడా చూస్తునారు. ఇక కాంగ్రెస్ అయితే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చి టీవీకే అధికారంలోకి అతి ముఖ్య కారణం అయింది. అన్నయ్యగా రాహుల్ విజయ్ తో చేతులు కలిపారు. మరో వైపు ఎన్డీయే కూడా విజయ్ అనే కొత్త పొలిటికల్ ఫ్యాక్టర్ ని తమిళనాడులో నిశితంగా పరికిస్తోంది. ఆయనతో వీలైనంతవరకూ సామరస్యంగానే ఎన్డీయే పెద్దలు వెళ్తున్నారు. ఈ మధ్యనే తమిళనాడులో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయ్ తో కలిసి పాలు పంచుకున్నారు.
రాహుల్ విత్ విజయ్ :
ఇక రాహుల్ గాంధీ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరసబెట్టి నిర్వహిస్తున్న ఆందోళన మధ్యలో సడెన్ గా చెన్నై వచ్చి విజయ్ తో కొద్ది గంటలు గడిపారు. మొదట ఇద్దరూ ఇండోర్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం చెన్నైలోకి ఒక కేఫ్ కి వెళ్ళి అక్కడ కాఫీ తాగుతూ అందరితో సెల్ఫీలు దిగారు. అలా ఎంతో కూల్ గా సరదాగా ఈ ఇద్దరు అగ్ర నేతలు గడిపిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు టూర్ లో విజయ్ ఆయనతో కనిపించారు.
రైలు ప్రారంభంలో :
ఇదిలా ఉంటే చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2లో భాగంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు కొత్త మెట్రో రైలులో కలిసి ప్రయాణించి, అందులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ మార్గంలో ప్రయాణికుల కోసం సాధారణ సర్వీసులను కూడా ప్రారంభించారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పలు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా విజయ్ తో ప్రారంభించారు.
ఢిల్లీ హీట్ ఉండగానే :
ఒక వైపు ఢిల్లీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. సీఈసీ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో సాగుతున్న విపక్షాల ఉద్యమం నిరంతర కార్యక్రమంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజయ్ పార్టీ టీవీకే ఇండియా కూటమిలో లేదు. కానీ తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. ఇక విజయ్ అయితే అవసరమైన సందర్భాలలో తప్పించి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు మీదనే ఫోకస్ పెట్టకుండా పాలన చేస్తున్నారు. రాహుల్ గాంధీ విజయ్ భేటీలో ఏమి చర్చించారు తెలియదు. రానున్న రోజులలో టీవీకే కూడా ఢిల్లీ పోరాటాలలో భాగం అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రిగా విజయ్ కేంద్ర ప్రభుత్వంతో గుడ్ రిలేషన్స్ ని కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన కేంద్ర పెద్దలతో కలిసి అనేక కార్యక్రమాలలో కనిపిస్తున్నారు. మొత్తానికి విజయ్ ఇపుడు దక్షిణ భారతాన అతి ముఖ్యమైన రాజకీయ ఆకర్షణగా ఉన్నారు అని విశ్లేషిస్తున్నారు.