ఎల్ నినో గండం నుంచి గట్టెక్కేందుకు రేవంత్ సీరియస్ ప్లానింగ్
శనివారం సాయంత్రం తన ఇంట్లో కీలక అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు.
శనివారం సాయంత్రం తన ఇంట్లో కీలక అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష రోటీన్ కు భిన్నంగా జరగటమే ఇక్కడ అసలు విశేషం. ఎల్ నినో విపత్తు ఎంత తీవ్రంగా ఉంటుందన్న అంశంపై ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నప్పటికి.. అంచనాలకు మించి ఉందన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన సీఎం రేవంత్.. దానికి సంబంధించిన నష్టనివారణ కార్యక్రమాన్ని స్వయంగా చేపట్టారని చెప్పాలి. రానున్న రోజుల్లో ఎల్ నినో ఎఫెక్టు తమ ప్రభుత్వం మీద పడుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవటమే కాదు.. ఈ సవాల్ ను ఎలా అధిగమించాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎదురైన తొలి విపత్తు కరోనా అయితే.. ఆ తర్వాత ఎదురైన సవాలుగా దీన్ని చెప్పాలి. కరోనా విషయానికి వస్తే.. అది యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది కాబట్టి.. ఆ సందర్భంగా ప్రభుత్వం మీద ప్రత్యేకంగా వ్యతిరేకత లేదు. దీనికి తోడు అప్పట్లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. విపత్తు వేళ ప్రజలకు అండగా ఉన్నామన్న భరోసాను కల్పించటంలో విజయవంతమయ్యారని చెప్పాలి. దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఇప్పుడు పెద్ద సవాలుగా మారిన ఎల్ నినో విషయానికి వస్తే.. దీని తీవ్రత కూడా చాలానే రాష్ట్రాల్లోనే కాదు.. పలు దేశాల మీద ఉన్నప్పటికి.. ఇదో అంతర్జాతీయ అత్యయిక పరిస్థితి అన్నట్లు ఉండదు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడకపోవటం.. సాగునీరు.. తాగునీరు కొరతతో పాటు విద్యుత్ కొరత కూడా ఎదురయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ అంశాల కారణంగా సాధారణ ప్రజలు ఎంతటి ప్రభావానికి గురవుతారన్న అంశంపై సీఎం రేవంత్ ఆందోళనతో ఉన్నట్లు చెబుతున్నారు.
ఎల్ నినో అన్నది ప్రభుత్వ వైఫల్యం కాదని.. ఇదో విపత్తు అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. దాని కారణంగా ఎదురయ్యే సమస్యలు.. సవాళ్లను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న సందేశం ప్రజలకు వెళ్లాలని సీఎం తపిస్తున్నారు. అంతేకాదు.. ఎల్ నినో ఎఫెక్ట్ తో తీవ్ర ప్రభావానికి గురయ్యే రంగాలు.. వాటి మీద ఆధారపడే వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సీఎం రేవంత ప్రత్యేక ఫోకస్ చేసినట్లుగా చెప్పాలి.
ఇందులో భాగంగా శనివారం రాత్రి జరిగిన రివ్యూలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. ఎల్ నినో ఎఫెక్టు ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసేలా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే.. నీళ్ల కొరతతో పాటు..కరెంట్ దొరకటం లేదన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. యాసంగిలో పంటలు వేస్తే నీటి సమస్య మరింత ఎక్కువ అవుతుందన్న విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. దాని కారణంగా ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేయాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే సీఎం రేవంత కార్యాచరణ ఉంది. మంత్రులతో భేటీ.. రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీడియోకాన్ఫరెన్స్ తో పాటు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజలకు ఎదురయ్యే కష్టనష్టాలను తీర్చేందుకు తమ ప్రభుత్వం చాలా వేగంగా పని చేస్తుందన్న విషయాన్ని తెలియజేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. విపక్షాన్ని ఇట్టే ఎదుర్కొన్న రేవంత్ కు.. ఎల్ నినో సవాల్ ను అధిగమించటం అంత తేలికైనది కాదన్న మాట బలంగా వీనిపిస్తోంది. ఇప్పటికే ఆ విషయాన్ని అర్థం చేసుకున్న సీఎం.. ప్రజలకు అర్థమయ్యేలా చేయటంలో ఎంత సక్సెస్ అవుతారన్నదే అసలు ప్రశ్న.