'ప్రజాస్వామ్య చోరీకి ప్రణాళిక'... రాహుల్ గాంధీ సంచలన పోస్ట్!

అవును... 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎలా రిగ్గింగ్ జరిగిందనేది ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.;

Update: 2025-06-07 08:17 GMT

గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో "మ్యాచ్ ఫిక్సింగ్ మహారాష్ట్ర" అనే తన ఆర్టికల్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిగ్గింగ్ జరిగాయని తాను ఎలా నమ్ముతున్నారో ఆయన వివరించారు.

అవును... 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఎలా రిగ్గింగ్ జరిగిందనేది ఆరోపిస్తూ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా.. "2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడానికి ఒక బ్లూప్రింట్" అని ఆయన ఎక్స్ లో రాశారు.

ఇదే సమయంలో... ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కూడా బీజేపీ రిగ్గింగ్ చేయాలని చూస్తోందని రాహుల్ తన ట్వీట్లో పేర్కొన్నారు! మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలను పక్కదారి పట్టించడానికి బీజేపీ వివరణాత్మక ఐదు దశల ప్రక్రియను అమలు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

1) 2023 ఎన్నికల కమిషనర్ల నియామకం చట్ట ప్రకారం ప్రధాన మంత్రి, హోం మంత్రి 2:1 మెజారిటీతో ఎన్నికల కమిషనర్లను సమర్థవంతంగా ఎన్నుకుంటారని.. ఎందుకంటే మూడో సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు ఓడిపోతారని తెలిపారు. ఎంపిక కమిటీలో ప్రధాన న్యాయమూర్తికి బదులుగా క్యాబినెట్ మంత్రిని ఉంచాలనే నిర్ణయాన్ని ప్రశ్నించారు.

2) 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో నమోదైన ఓటర్ల సంఖ్య 8.98 కోట్లు కాగా.. ఇది ఐదు సంవత్సరాల తర్వాత మే 2024 లోక్ సభ ఎన్నికల నాటికి 9.29 కోట్లకు పెరిగిందని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే... నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ సంఖ్య ఏకంగా 9.70 కోట్లకు పెరిగిందని.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ డేటా చూపిస్తుందని తెలిపారు!

అంటే... మహారాష్ట్రలో ఐదు సంవత్సారాల్లో 31 లక్షల ఓట్లు పెరిగితే... ఆ తర్వాత కేవలం ఐదు నెలల్లోనే 41 లక్షలు పెరిగారని.. ఈ పెరుగుదల ఎంత నమ్మశక్యం కానిదంటే... ప్రభుత్వం సొంత అంచలాన ప్రకారం మహారాష్ట్రలో 9.54 కోట్ల మంది వయోజన్లు ఉంటే.. అంతకంటే ఎక్కువగా 9.70 కోట్ల మంది ఓటర్లు ఉండటం గమనార్హం అని అన్నారు!

3) ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ శాతం 58.25 గాఉంది. అనంతరం ఎక్కడా భారీ క్యూలైన్లు ఉన్నట్లు వార్తలు రాలేదు! కానీ.. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం ఓటింగ్ మరింత పెరుగుతూ ఉందని.. ఈ క్రమంలో పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఉదయం 66.05 శాతంగా నమోదవ్వడం గమనార్హం అని రాహుల్ రాశారు!

ఈ అపూర్వమైన 7.83 శాతం పాయింట్ల పెరుగుదల 76 లక్షల ఓటర్లకు సమానమని.. ఇది మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికలకంటే చాలా ఎక్కువని తెలిపారు.

4) మహారాష్ట్రలో సుమారు లక్ష బూత్ లు ఉన్నాయని చెప్పిన రాహుల్ గాంధీ.. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పేలవమైన ప్రదర్శన కనబరిచిన పార్లమెంట్ స్థానాల పరిధిలోని 85 నియోజకవర్గాల్లోని సుమారు 12,000 బూత్ లలో మాత్రమే ఎక్కువ మంది ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు.

ఈ క్రమంలోనే... సాయంత్రం 5 గంటల తర్వాత ప్రతీ బూత్ లో సగటున 600 మందికి పైగా ఓటర్లు ఉంటే.. ప్రతీ ఓటరు ఓటు వేయడానికి కనీసం ఒక నిమిషం సమయం అవసరమని భావిస్తే.. ఓటింగ్ కు కనీసం 10 గంటలు సమయం పట్టాలి. కానీ.. అది ఎక్కడా జరగలేదు. మరి అదనపు ఓట్లు ఎలా పోలయ్యాయి? అని ప్రశ్నించారు. ఈ 85 స్థానాల్లోనూ మెజారిటీ స్థానాలు ఎన్డీయే గెలిచిందని.. ఇందులో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొన్నారు!

5) ఈ సందర్భంగా... ఈ విషయాలన్నింటిపైనా ఈసీ మౌనంగా ఉందని చెప్పిన రాహుల్ గాంధీ... 2024 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఫోటోలతో కూడిన ఓటరు జాబితాలను అందుబాటులో ఉంచాలన్న అభ్యర్థనలను ఎన్నికల కమిషన్ వెంటనే తోసిపుచ్చిందని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే... 2024 నవంబర్ లో మహారాష్ట్రంలో రిగ్గింగ్ ఎందుకు ఇంత దారుణంగా పెరిగిందో ఊహించడం కష్టం కాదని అన్నారు. అయితే.. రిగ్గింగ్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదని.. ఫిక్సింగ్ జట్టు ఆట గెలవచ్చు కానీ.. “సంస్థ”లకు, ఫలితంపై ప్రజల నమ్మకానికి కోలుకోలేని నష్టం జరుగుతందని.. మ్యాచ్ ఫిక్స్డ్ ఎన్నికలు ఏ ప్రజాస్వామ్యానికైనా విషం లాంటివని తెలిపారు.

Tags:    

Similar News