రాహుల్ ఎఫెక్ట్.. 4 రాష్ట్రాల ఈసీ వెబ్ సైట్లు డౌన్..? ఏం జ‌రుగుతోంది?

దాదాపు రెండేళ్ల కింద‌ట జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్ప‌టి అధికార‌ బీజేపీ ఓడిపోయింది.;

Update: 2025-08-08 11:32 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద తేనె తుట్టెనే క‌దిపారా? ఏకంగా రాజ్యాంగబ‌ద్ద సంస్థ ఎన్నిక‌ల సంఘం (ఈసీ) విశ్వ‌స‌నీయ‌త‌ను ప్ర‌శ్నార్థ‌కం చేశారా..? ఈ దెబ్బ‌కు ఓట‌రు లిస్టు వెబ్ సైట్ లు డౌన్ అయ్యాయా..? ప‌రిణామాల‌ను చూస్తుంటే ఔన‌నే అనిపిస్తోంది. గురువారం ఢిల్లీలో రాహుల్ ప్రెస్ మీట్.. శుక్ర‌వారం బెంగ‌ళూరులో నిర‌స‌న ర్యాలీ నేప‌థ్యంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది.

ఆ రెండు కీల‌క రాష్ట్రాల్లో..

దాదాపు రెండేళ్ల కింద‌ట జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్ప‌టి అధికార‌ బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కానీ, 15 నెల‌ల కింద‌ట జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంది. ఇక గ‌త ఏడాది చివ‌ర్లో జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ గెలుపు ఎవ‌రూ ఊహించ‌నిదే. అంత‌కు ఆరు నెల‌ల ముందు లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌క్కువ సీట్ల‌కు ప‌రిమిత‌మైంది మ‌హాయుతి (బీజేపీ-శివ‌సేన‌-ఎన్సీపీ) కూట‌మి. కానీ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్ట్ర‌యిక్ రేట్ తో గెలుపొందింది.

ఓట్ల చోరీ ఆరోప‌ణ‌ల‌తో..

క‌ర్ణాట‌క లోక్ స‌భ‌, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీగా ఓట్ల చోరీ జరిగిందని, దీనికి ఎన్నిక‌ల సంఘ (ఈసీ) కార‌ణం అంటూ సాక్షాత్తు లోక్ సభలో ప్ర‌తిపక్ష నేత, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ అగ్ర నేత‌ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు చేశారు. మొద‌టినుంచి మోదీ ప్ర‌భుత్వం రాజ్యాంగ సంస్థ‌ల‌ను గుప్పిట్లో పెట్టుకుని ఆరోపిస్తున్నారు రాహుల్. తాజాగా ఎన్నిక‌ల సంఘం ఆయన టార్గెట్ గా మారింది. రాహుల్ వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయం అవుతున్నాయి.

స్వతంత్ర‌త‌కు మ‌చ్చ‌..

రాజ్యాంగబ‌ద్ధ సంస్థ అయిన ఎన్నిక‌ల సంఘం (ఈసీ)ను రాహుల్ గ‌తంలో ప‌ద‌ప‌దే టార్గెట్ చేశారు. అప్ప‌టికంటే ఈసారి మరింత ప‌దును పెంచారు. ఆయ‌న ఆరోపణలతో స్వతంత్ర సంస్థగా చెప్పుకొంటున్న ఈసీ ఆత్మరక్షణలో పడింది. దీనికి నిద‌ర్శ‌నం.. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజంటేషన్ ఇస్తుండగానే కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు ఆయనకు సవాళ్లు విసిరారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రమాణం చేసి అఫిడవిట్ సమర్పించాలని, లేకపోతే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల‌ని ట్వీట్లు చేయడంతో పాటు రాహుల్ కు లేఖలు పంపారు. అయితే, దీనిపై వెనక్కితగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చేసింది. ఈ క్ర‌మంలో రాహుల్ తదుపరి ప్లాన్ ఏంటో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ఎన్నికల కమిషన్ వర్గాలు తదుపరి చర్యలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

ఆ నాలుగు రాష్ట్రాల సైట్ల డౌన్...

శుక్ర‌వారం ఉద‌యం నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారుల వెబ్ సైట్లు పనిచేయడం లేదు. వీటినుంచి రాహుల్ గాంధీ ఎన్నికల డేటా తీసుకుని బయటపెడతారనే మూసేశారని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా వివరణ ఇచ్చేందుకు ఈసీ సిద్దంగా లేదు. దీంతో కాంగ్రెస్ నాయ‌కుల అనుమానాల‌కు బ‌లం చేకూరింది.

-ఈసీ నిష్పాక్షికత ప్రదర్శన ప్రారంభమైంది** అని కాంగ్రెస్ ఎంపీ రణ‌దీప్ సూర్జేవాలా వెట‌కారం ఆడారు. రాహుల్ ఆరోపణలు చేయగానే... నాలుగు రాష్ట్రాల‌ ఈ-ఓటర్ పేజీలు డౌన్ అయ్యాయ‌ని ఆరోపించారు. కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు రాహుల్ గాంధీ ఆరోపణల వీడియోల‌ను ట్వీట్లు చేస్తున్నారు. ఆయ‌న ఆరోపణలకు జవాబు చెప్పాలని ఈసీని కోరుతున్నారు.

-నిరుడు మ‌హారాష్ట్ర‌, అంత‌కుముందు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ అసెంబ్లీల ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటన్నిట్లోనూ బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ నుంచి అధికారం చేజిక్కించుకుంది. మ‌రీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌లో బీజేపీ గెలుపు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Tags:    

Similar News