రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు.. ఈసీని గట్టిగా టార్గెట్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.;

Update: 2025-09-18 10:05 GMT

కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు తొలగిస్తున్నారని, నకిలీ లాగిన్లు, నకిలీ ఫోన్ నెంబర్లతో ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని రాహుల్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను ఆయన మీడియా సమక్షంలో ప్రదర్శించారు. ఓట్ చోరీ చేస్తోందంటూ ఈసీపై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేస్తున్న రాహుల్.. తన వద్ద హైడ్రోజన్ బాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని కొద్ది రోజుల క్రితం హెచ్చరించారు. అయితే తాజా ఆరోపణలు హైడ్రోజన్ బాంబు కాదని, అది వేరే ఉందని చెప్పుకొచ్చారు.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు చేపట్టారని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రం వెలుపల నుంచి సాఫ్ట్ వేర్ ఉపయోగించి ఈ తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను టార్గెట్ చేసుకుని ఓట్లు తొలగిస్తున్నట్లు రాహుల్ ఆరోపించారు. ఇందుకు తమ వద్ద వంద శాతం ఆధారాలు ఉన్నాయని వివరించారు. ‘నేను ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను ఇష్టపడతాను. ఇక దీనికి ఎలా స్పందించాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది’అని రాహుల్ స్పష్టం చేశారు.

అక్రమంగా తొలగించిన ఓటర్లను ఆయన మీడియా ముందుకు తెచ్చారు. ఇది కేవలం ఓటర్ల జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో తేడాలు, అక్రమాలు సరిచేయాల్సిన సమయం వచ్చిందని తేల్చిచెప్పారు. ఈ చీకటి రాజకీయం కోసం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6,000 ఓట్లను నకిలీ లాగిన్ ద్వారా తొలగించారు. ఈ ప్రక్రియలో సాఫ్ట్ వేర్ ను దుండగులు హైజాక్ చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న బూత్ లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని చెప్పారు. ప్రజాస్వామ్య విధ్వంసకులను ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.

మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రతి బూత్‌లో మొదటి పేరును ఆటోమేటెడ్ ప్రోగ్రాం ద్వారా తొలగించేలా రూపొందించారని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో రాష్ట్రానికి చెందిన వారు కాకుండా ఇతర ప్రాంతాల ఫోన్లు ఉపయోగించి OTPలతో అప్లికేషన్లు దాఖలు చేసినట్లు ఆయన ఆరోపించారు. వీటి గురించి కర్ణాటకలో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈసీకి తెలిపినా పట్టించుకోలేదన్నారు.

Tags:    

Similar News