బీహార్ జారితే రాహుల్ జాతకం ?
అయితే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి మూడవసారి వచ్చిన తరువాత హర్యానా మహారాష్ట్ర ఢిల్లీలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.;
బీహార్ ఎన్నికల మీద కోటానుకోట్ల ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. గాంధీల వంశంలో అయిదవ తరానికి చెందిన రాహుల్ గాంధీకి వారసత్వం అయితే దక్కింది కానీ అందలం మాత్రం అందనంత దూరంలోనే ఉంది. ప్రధాని పదవి అంటే వారి ఇంట్లోనే ఉండేది, కానీ ఇపుడు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నా రాహుల్ గాంధీ కనీసం అధికారానికి చేరువగా కూడా వెళ్లలేకపోయారు. 2014 నుంచి ఆయన మోడీని బీజేపీని ఢీ కొడుతూనే ఉన్నారు. యూపీయే వన్ యూపీయే టూ పాలనలో యాంటీ ఇంకెంబెన్సీ వల్ల 2014 ఎన్నికలు దెబ్బ తీశాయని భావించినా 2019లో పరాజయం ఆయనకు చేదు అనుభవం. దానికి ప్రతిఫలంగా తన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలేసుకున్నారు. 2024లో ఇండియా కూటమి కట్టి బీజేపీని సవాల్ చేసినా ఫలితం మాత్రం ఏమీ లేకపోయింది.
బీహార్ నుంచే అంతా :
అయితే కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి మూడవసారి వచ్చిన తరువాత హర్యానా మహారాష్ట్ర ఢిల్లీలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ మూడూ కూడా బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. దాంతో ఇండియా కూటమి మరింత ఇబ్బందుల్లో పడిపోయింది. ఇక బీహార్ అన్నది ఇండియా కూటమికి ప్రత్యేకించి రాహుల్ గాంధీకి ఇపుడు ఒక కీలక స్థావరంగా మారింది. అందుకోసమే అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందు నుంచే రాహుల్ గాంధీ అక్కడ తన హవా చూపించడం ప్రారంభించారు. ఓటర్ అధికార్ యాత్ర అంటూ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఓట్ల చోరీ అని ఈసీ మీదనే విమర్శలు చేయడం కానీ మోడీ మీద డైరెక్ట్ గా హాట్ కామెంట్స్ చేస్తూ టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా బీహార్ ఎన్నికల కోసమే అని భావిస్తున్నారు. బీహార్ లో కచ్చితంగా మహా ఘట్ బంధన్ గెలుస్తుందని దాంతో ఇండియా కూటమి దశ మారుతుందని రాహుల్ అండ్ కో గట్టిగా భావిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ సర్వేలు :
ఈ నేపధ్యంలో ఎగ్జిట్ పోల్ సర్వేలు బీహార్ మీద వెలువడ్డాయి. అవన్నీ కూడా ఏకపక్షంగా ఎన్డీయేకు పట్టం కట్టాయి. సీట్లూ అటూ ఇటూ చెప్పినా మరోసారి ఎన్డీయే గెలిచి తీరుతుందని కుండ బద్ధలు కొట్టాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా మహా ఘట్ బంధన్ గెలుస్తుందని చెప్పకపోవడం ఇండియా కూటమినే కాదు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరచైంది. ప్రీ పోల్స్ సర్వేలు చూస్తే మహా ఘట్ బంధన్ కి కొంత ఎడ్జ్ ఉంటుందని చెప్పుకొచ్చాయి. కానీ రెండు విడతల పోలింగ్ తరువాత సీన్ మొత్తం మారిందని ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మొత్తం రివర్స్ లో చెబుతున్నాయి. దాంతో ఇండియా కూటమిలో దీని మీదనే చర్చ సాగుతోంది.
నమ్మమంటూనే :
ఎగ్జిట్ పోల్ సర్వేలను మేము నమ్మకం ఎగ్జాక్ట్ పోల్స్ లో విజయం మహా ఘట్ బంధన్ దే అని కాంగ్రెస్ ఆర్జేడీ నేతలు అంటున్నారు. అయితే ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ రావడానికి కూడా ఒకే ఒక్క రోజు మధ్యలో ఉంది. ఈ నెల 14న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఫలితాలు రావడం మొదలవుతాయి. పది గంటలకల్లా ట్రెండ్ అన్నది తెలిసిపోతుంది. మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే అసలు ఫలితాలు కూడా ప్రతిబింబిస్తే అపుడు ఏమిటి అన్న సంగతి కూడా ప్రశ్నగా ఉంది. చాలా సందర్భాలలో ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలే అసలు ఫలితాలుగా వచ్చాయి. కొన్ని సార్లు మాత్రమే తప్పు అయ్యాయి.
ఓటమి చెందింతే కనుక :
బీహార్ లో ఎన్డీయే మరోసారి గెలిచి మహా ఘట్ బంధన్ ఓటమి పాలు అయితే ఆర్జేడీకి ఎంత వరకూ నష్టం ఉంటుందో తెలియదు కానీ రాహుల్ గాంధీకి మాత్రం అది ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అని అంటున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న ఆవేదన ఉంది. ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ కి దాని అగ్ర నేతగా రాహుల్ కి ఈ ఫలితాలు చాలా ముఖ్యం. ఒకవేళ రివర్స్ అయితే మాత్రం ఇండియా కూటమిలో సైతం నాయకత్వంలో మార్పులు చాలా జరుగుతాయని అంటున్నాయి. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఇజ్జత్ మే సవాల్ అన్నట్లుగా బీహార్ ఎన్నికల్లో పోరాడారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.