రాహుల్ గాంధీ షాకింగ్ డెసిషన్.. 22 మంది చిన్నారుల దత్తత తీసుకోనున్న అగ్రనేత

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-07-29 23:30 GMT

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత ఒకేసారి 22 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దుల్లో తల్లిదండ్రులు, కుటుంబాలను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ వెల్లడించారు. చిన్నారుల డిగ్రీ చదువు పూర్తయ్యేవరకు వారికి అన్నివిధాల సహాయం చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు చెప్పారు.

ఇటీవల దాయాది దేశంతో ఏర్పడిన ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో నష్టపోయిన గ్రామాల ప్రజలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ సమయంలో పూంచ్ జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధలు ఆయన దృష్టికి వెళ్లాయి. దీంతో అలా అనాథలైన పిల్లల జాబితాను తయారు చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలను రాహుల్ ఆదేశించారు. కాంగ్రెస్ నేతల సర్వేలో మొత్తం 22 మంది పిల్లలు ఆసరా లేకుండా పోయారని గుర్తించారు. వీరు పెద్దయ్యే వరకు విద్య, వైద్యం, వసతి సౌకర్యాలను కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

అదేవిధంగా పూంఛ్ లోని పబ్లిక్ స్కూల్ ను సందర్శించిన రాహుల్ తల్లిదండ్రులను కోల్పోయిన పలువురు విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత సాయంతో పలువురు చిన్నారులకు మంచి భవిష్యత్తు అందనుందని అంటున్నారు. పహల్గాం ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. మన బలగాలు దీటుగా సమాధానం చెప్పడంతో జీర్ణించుకోలేని పాకిస్థాన్ సరిహద్దుల్లోని జమ్మూ కాశ్మీర్ గ్రామాల ప్రజలపై దాడులకు దిగింది. పాక్ చర్యలకు పూంచ్ ప్రాంతంలో అమాయక ప్రజలు ఎక్కువగా నష్టపోయారు. అక్కడ సుమారు 25 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు.

Tags:    

Similar News